– ప్రజాదర్బార్ విజ్ఞప్తికి స్పందించిన మంత్రి
– ప్రాణాపాయ స్థితిలో ఉన్న 14 రోజుల పసికందుకు వైద్యసాయం
– లోకేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
అమరావతి, మహానాడు: ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ 14 రోజుల పసికందుకు పునర్జన్మిచ్చింది. తమ బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, వైద్య సాయం చేసి ఆదుకోవాలంటూ ప్రజాదర్బార్ కు తరలివచ్చి వేడుకున్న ఆ తల్లిదండ్రులకు లోకేష్ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించి పసికందు ప్రాణాలను కాపాడారు. ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేటకు చెందిన చదల వెంకట మహేశ్వరరావుకు రెండో సంతానంగా మగ శిశువు జన్మించాడు. 14 రోజులకు శిశువు రాత్రిళ్లు ఏడుస్తుండటం, పాలుతాగకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే శిశువుకు ప్లేట్ లెట్స్ పడిపోయి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్సకు భారీగా ఖర్చవుతుందని తెలిపారు.
గిరిజన కుటుంబానికి చెందిన మహేశ్వరరావు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడం, మరోవైపు కన్నబిడ్డకు మృత్యువు ముంచుకొస్తుండటంతో ఎటూ పాలుపోని పరిస్థితి. దీంతో మిత్రుడి సలహా మేరకు గత నెల 27న అర్ధరాత్రి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసం వద్దకు చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్ లో మంత్రి లోకేష్ ను కలిసి మరో అయిదు నిమిషాల్లో తన బిడ్డ చనిపోతాడని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి లోకేష్.. వైద్యానికి అవసరమైన సాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించి శిశువు ప్రాణాలను నిలిపారు. 14 రోజుల పాటు చికిత్స పొంది తమ బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. నేటి ప్రజాదర్బార్ లో మంత్రి లోకేష్ ను కలిసి ఆయన చేసిన సాయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తాము జన్మజన్మలా రుణపడి ఉంటామని కన్నీటిపర్యంతమయ్యారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.