26వ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు

– ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు

అమరావతి, మహానాడు: తెలుగు దేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుంచి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. సీఎం ఏమన్నారంటే.. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాం. సాధారణ సభ్యత్వ రుసుం ఎప్పటిలాగా రూ.100. ఈ ఏడాది నుంచి కొత్తగా లైఫ్ టైం సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నాం. దీని రుసుం రూ.1,00,000 గా నిర్ణయం. మెంబర్ షిప్ ఉన్న వారు చనిపోతే అందించే ఇన్సూరెన్స్ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. చనిపోయిన కార్యకర్తలకు రూ.10 వేలు మట్టి ఖర్చులు ఇద్దాం.

గతంలో ఇన్స్యూరెన్స్ రాని 73 మందికి రెండు లక్షల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం. ప్రమాద బీమా కింద ఇప్పటి వరకు రూ.102 కోట్లు, సహజ మరణం, ఇతర సమస్యలకు రూ.18 కోట్లు సాయంగా అందించాం. విద్యార్థుల చదువు కోసం రూ.2 కోట్ల 35 లక్షలు అందించాం.

లీడర్‌, క్యాడర్‌, ఎంపవర్‌మెంట్‌ ఏర్పాట్లు చేస్తున్నాం. అవినీతి మరక లేకుండా క్యాడర్ ను ఆర్థికంగా నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నాం.

పార్టీ కోసం పనిచేసిన నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలి.

పార్టీకి కొత్త రక్తం వచ్చింది

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 మంది కొత్తఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారని, 18 మంది కొత్తమంత్రులు ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్త, పాత నేతల మధ్య విభేదాలు వచ్చినా అందరూ సర్దుకుపోవాలన్నారు. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేని వారికి తప్పకుండా రాజకీయంగా న్యాయం చేస్తామన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించారని
ఈ సందర్భంగా గుర్తు చేశారు.