వైద్య పరిశోధనలకు రేగుల స్వతంత్ర భారతి మృతదేహం

– చివరి కోరిక మేరకు కాటూరు మెడికల్ కళాశాలకు అప్పగింత

విజయవాడ, మహానాడు: మృతి అందరిదీ. కాని స్మృతి కొందరికే దక్కుతుంది. ఆ కోవకే చెందుతారు రేగుల స్వతంత్ర భారతి. మరణానంతరం కూడా తాను ఈ సమాజానికి ఏదో రూపంలో ఉపయోగపడాలని భావించారు. హిందూ సాంప్రదాయాలకు భిన్నంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన మృతి అనంతరం పార్దీవ దేహానికి కర్మకాండలు వద్దని తన కుటుంబ సభ్యులను ఒప్పించి ముందుగానే దానిని వైద్య విద్యార్ధుల ప్రాక్టికల్స్ నిమిత్తం అప్పగించేలా అంగీకార పత్రం సిద్దం చేశారు. వయోభారం ఫలితంగా మంగళవారం రాత్రి స్వతంత్ర భారతి విజయవాడలో చనిపోగా ఆమె చివరి కోరిక మేరకు బుధవారం మృత దేహన్ని కాటూరి మెడికల్ కళాశాలకు అప్పగించారు.

కొత్తగూడెం సింగరేణి కాలరీస్ లో ప్రెస్ ఆపరేటర్ గా ఉద్యోగం నిర్వహించిన ఆమె పదవీ విరమణ అనంతరం కూడా అక్కడే ఉంటూ వచ్చారు. గత ఆరునెలల క్రితం ఆరోగ్యం సహకరించకపోవటంతో విజయవాడలోని తన తమ్ముడు రేగుల సతీష్, జయశ్రీ కుటుంబంతో ఉంటున్నారు. భారతికి పిల్లలు లేకపోవటంతో సోదరుని కుటుంబమే అన్ని అయి వృద్దాప్యంలో అండగా ఉంటూ వచ్చారు.

1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున జన్మించిన ఆమెకు వారి తల్లిదండ్రులు స్వతంత్ర భారతి పేరిట నామకరణం చేశారు. పేరుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ, కమ్యూనిస్టు భావజాలంతో గడిపుతూ వచ్చిన ఆమె ఈ నిర్ణయంతో మరణించి పరోక్షంగా జీవించే ఉన్నారు. భారతి దేహాన్ని అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) విభాగం తమ పరిశోధనలకు వినియోగిస్తుందని కాటూరి మెడికల్ కళాశాల ప్రతినిధులు తెలిపారు. ఎల్ వి ప్రసాద్ నేత్ర విజ్ణాన సంస్ధ మృతి అనంతరం సకాలంలో నేత్రాలను స్వీకరించింది. కాటూరు మెడికల్ కళాశాల నుండి వచ్చిన బృందానికి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో దేహాన్ని అప్పగించారు.