భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు మంత్రి లోకేష్ సమీక్ష

మంగళగిరి, మహానాడు: మంగళగిరి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఎప్పటికపుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయ కంట్రోల్ రూమ్ ద్వారా గంటగంటకు పరిస్థితులను వాకబు చేస్తూ సహాయ చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు. వరద ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంత వాసులకు తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు.

భారీవర్షం కారణంగా బ్లాక్ అయిన రోడ్లను వెంటనే క్లియర్ చేసి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిందిగా సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, మంచినీరు అందిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరారు. తుపాను తీవ్రరూపం దాల్చుతున్నందున అధికారులంతా 24/7 అందుబాటులో ఉండాలని, అవసరాన్ని బట్టి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.