తొలగించిన వారిని తిరిగి నియమించండి

హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన సిబ్బందిని తిరిగి నియమించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు.

సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైమ్ టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డీ.ఈ.వోలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు.
లేఖ పూర్తి పాఠం ఇదీ..

శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

విషయం : సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో తొలగించిన సిబ్బందిని పునర్ నియామకం చేయడం మరియు పెండింగ్ జీతాలను చెల్లించడం గురించి.

సెప్టెంబర్ 5న జరిగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం టీచర్లకు అదనపు ప్రోత్సాహకాలు అందిచడం ఆనవాయితి. అలాంటి సంప్రదాయాన్ని పాటించకపోగా విద్యా బుద్ధులు నేర్పే గురువులను అర్థాంతరంగా తొలగించి వారికి, వారి కుటుంబాలకు అంతులేని క్షోభను కలిగించారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైమ్ టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డీ.ఈ.వో.లను ఏక కాలంలో తొలగించారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. దీనిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. గడిచిన మూడు నెలలుగా వీరికి జీతాలు చెల్లించడం లేదు. జీతాలు అడిగిన పాపానికి ఏకంగా వారిని ఉద్యోగాల నుంచే తొలగించడం ఎంత వరకు సమంజసం. ఇదేనా మీరు చెపుతున్న ప్రజా పాలన.

విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించడం ద్వారా విద్యార్థులకు కూడా తీరని నష్టం జరుగుతున్నది. సిలబస్ పూర్తికాక విద్యార్థులు నష్టపోతున్నారు. తొలగింపుకు గురైన టీచర్లు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న బాధ చెప్పనలవి కానివి.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటి కోచింగ్ కూడా అందించే వాళ్ళం. ఫలితంగా వేల మంది విద్యార్థులకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశాలు లభించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో ఐఐటీ కోచింగ్ ఇచ్చే గురువులను తొలగించారు. దీని వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతున్నది. వెంటనే రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఎన్ఐటి కోచింగును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నం.

తొలగించిన పార్ట్ టైమ్ లెక్చరర్లు, టీచర్లు, డీ.ఈ.వో.లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వారి జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నాము.

ఇట్లు
తన్నీరు హరీశ్ రావు
శాసనసభ్యులు, సిద్దిపేట