ఊపందుకున్న ఆక్రమణల తొలగింపు!

– వెల్లువెత్తుతున్న అభినందనలు

గుంటూరు, మహానాడు: నగరంలో డ్రైన్ల ఆక్రమణల తొలగింపు వేగంగా జరుగుతోందని, దశలవారీగా వీటిని తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కమిషనర్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో ఆదివారం పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓల్డ్ క్లబ్ రోడ్ లో కొన్ని హాస్పిటల్స్ డ్రైన్ పై స్లాబ్ లు వేసి జనరేటర్లు, కార్ పార్కింగ్ లకు వినియోగిస్తున్నారని, దీనివలన డ్రైన్ లో ఉన్న సిల్ట్ తీయడానికి వీలు లేకుండా పోతుందన్నారు. వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి కాబట్టి వాటిని కూడా తొలగించాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డ్రైన్ మీద ఉన్న ప్రతి ఆక్రమణ తొలగించాల్సిందేనన్నారు. ఆక్రమణల తొలగింపునకు విధులు కేటాయించిన ప్రతి ఒక్క అధికారి, కార్యదర్శి పూర్తి స్థాయిలో విధుల్లో ఉండాలన్నారు. ఆక్రమణల తొలగింపు వ్యర్ధాలను ఎప్పటికప్పుడు నగరంలోని జిఎంసికి చెందిన లో లెవల్ స్థలాల్లో మెరక చేయడానికి తరలించాలన్నారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ పి.సమత, తూర్పు ఎంహెచ్ఓ (ఇంచార్జి) రామారావు, ఈఈ కోటేశ్వరరావు, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, టిపిఎస్ రసూల్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.