– మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు, మహానాడు: ఎన్టీఆర్ ఆలోచన మేరకు పేదరికం నిర్మూలన, పేదవాడి ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్ల పునఃప్రారంభమయ్యాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో అన్నా క్యాంటీన్లను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి మార్కెట్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, తెనాలి బస్టాండ్ ఎదురుగా అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు.
గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను మూర్ఖంగా సమాజం తల దించే విధంగా నిలిపివేశారన్నారు. పేదవాడి కడుపు నింపటానికి ఐదు రూపాయలకే భోజనం పెడుతుంటే ఈర్ష్యతో గత ప్రభుత్వం తన బుద్ధిని చూపించుకుందన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అందరమూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. మొదటి క్యాబినెట్ లోనే అన్న క్యాంటీన్లు ఆమోదంతో పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న సంగతిని తెలిపిందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.