-మరోసారి మోసపోయి ఓట్లేస్తారా?
-పిరికిపందలు రంజిత్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి
-ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధిచెప్పాలి
-మతంతో ఓట్లడిగే బీజేపీని తరిమికొట్టండి
-చేవెళ్లలో బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చేవెళ్ల, మహానాడు: హామీలు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి ఓసారి మోసగించారు…ఇప్పుడు మరోసారి మోసం పార్ట్ 2 సినిమా చూపిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీకి, ఎన్డీఏ కూటమికి 400 కాదు..200 సీట్లు కూడా వచ్చేలా లేవు. కాంగ్రెస్ పార్టీ కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్‌ఎస్‌కు మంచి సీట్లు రావాలి…8 నుంచి 10 సీట్లు ఇస్తే మనం చెప్పినట్లే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వింటది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.
బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్
బలహీన వర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటిసారిగా బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు. అందరం కలిసి బాహుబలి కాసాని అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. రైతుల దగ్గరకు వెళ్లి రూ.2 లక్షల హామీ నెరవేరిందా అని ప్రశ్నించారు. మీరంతా బాహుబలి సినిమా చూశారా? అందులో రెండు పార్టులు ఉన్నట్లే…రేవంత్ రెడ్డి మోసం పార్ట్-1 అయిపోతుంది…మోసం పార్ట్-2 సీక్వెల్ పెట్టుకున్నాడు. ఒకసారి మోసపోయింది చాలదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు…100 రోజుల అబద్ధాల పాలన ఒక వైపు ఉంది ఆలోచించి ఓటే వేయాలని అభ్యర్థించారు. రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుం టూ పోతే కేసీఆర్ ఎన్నో మంచిపనులు చేశారు. చేవెళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకు న్నాం. వికారా బాద్‌ను జిల్లా చేసుకున్నాం. 111 జీవోను కూడా ఎత్తివేసింది కేసీఆర్ మాత్రమే అన్నది గుర్తు చేసుకోవాలని సూచించారు.
మతం పేరుతో ఓట్లడిగే బీజేపీకి బుద్ధిచెప్పాలి
బీజేపీ పదేళ్లలో ఏమీ చేశారో చెప్పి ఓటు అడగుమంటే చెప్పేందుకు ఒక్కటీ లేదు. మోదీ తెలంగాణకు ఒక్క కాలేజ్ పెట్టినవా, స్కూల్ ఇచ్చినవా, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఏమీ ఇచ్చినవ్ అని ప్రశ్నించారు. రాముడితోని మనకు పంచాయితీ లేదు. రాముడు అందరివాడు.
మతం పేరుతో విద్వేషాలు నింపి ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు ఆలోచించాలి. మోదీ సిలిండర్ ధరను ఎంత పెంచిండో గుర్తు చేసుకోవాలి. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిండు. ఎందుకు ఓట్లు వేయాలి… రూ.70 పెట్రోల్‌ను రూ.110 చేసినందుకా? డీజిల్ రేట్లు పెంచినందుకా? సిలిండర్ రేట్లు పెంచినందుకా? పప్పు, ఉప్పుల ధరలు పెంచినందుకా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ మాత్రం మోదీ దేవుడు అంటాడు. ఆయన దేనికి దేవుడో చెప్పుమంటే చెప్పడు.
రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే బీజేపీకి కచ్చితంగా మన బుద్ధి చెప్పాలి. ఈ ప్రాంతా నికి బీజేపీ ఏం చేసిందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓటు అడుగుతాడు. కృష్ణా నీళ్లలో వాటా తేల్చుమంటే పదేళ్లుగా దాన్ని తేల్చలేదు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వ మంటే ఇవ్వ లేదు. బీజేపీని అడ్డుకునేది ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. ఈటెల, రఘునందన్‌రావు, అరవింద్, సోయం బాపురావును ఓడిరచిందెవరు? కిషన్‌రెడ్డిని పోటీ చేసేందుకే భయపడేలా చేసిందే బీఆర్‌ఎస్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే చేవెళ్లలో కాంగ్రెస్ పని అయిపోయిందని తెలిపారు.