-కమిటీ వేసి సంప్రదింపుల తర్వాత చేయాల్సింది
-సోనియా గాంధీ మెప్పుకోసమే తాపత్రయం
-బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్: అధికారిక చిహ్నం మార్పుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల విషయంలో కాంగ్రెస్ రసాభాసగా వ్యవహరిస్తోంది. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగి స్తారనే వాదనలతో అనేక అపోహలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భావోధ్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ అధికారిక చిహ్నాన్ని మార్చాలనుకుంటే ఒక కమిటీ వేసి గైడ్‌లైన్స్ రూపొందించి మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారుల సంప్రదింపుల తర్వాత అందరి ఆమోదయోగ్యంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయంతో అపోహలు సృష్టించే ప్రయ త్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.
పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదు
చార్మినార్ దురాక్రమణదారులు కట్టిన కట్టడం. కాకతీయ కళాతోరణంతో కాకతీయ సామ్రాజ్య వైభవం ప్రతిబింబించే చిహ్నం. ఇది స్వదేశీరాజులు నిర్మించిన కట్టడం. కాకతీయ కళాతోరణ చిహ్నాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని హెచ్చరిస్తున్నాం. ఎవరినీ సంప్రదించకుండా తెలంగాణ రాష్ట్ర గేయంలో మార్పులు చేయడం సరికాదు. అసలు ఏం మార్పులు చేశారనేది పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదు? రేవంత్‌కు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియదు. ఎప్పుడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఇదంతా సోనియా గాంధీ మెప్పుకోసమేనా? పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన లోనూ రాష్ట్ర గీతం పట్ల ఎందుకు పట్టించుకోలేదు? తెలంగాణ జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి నేడు ఉద్యమకారుల త్యాగాలను మరిచిపోయారు. ఉద్యమాన్ని రేవంత్‌రెడ్డికి తాకట్టుపెట్టినట్లుగానే ప్రజలు భావిస్తున్నారు.