స్టాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ
వినుకొండ, మహానాడు: సామాన్యులకు నిత్యవసర సరుకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. దీనిలో భాగంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినుకొండ డాల్ & రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన స్టాల్ ను ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో వ్యాపారులు రాయితీపై బియ్యం కందిపప్పు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న ప్రజల కష్టాలు తీర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయితీపై నిత్యావసర సరుకులు అందించేందుకు శ్రీకారం చుట్టారని అన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు 180 రూపాయలు ఉండగా, రాయితీపై 160 రూపాయలకు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే 48, 49 రూపాయలకు కిలో బియ్యం అందించడం జరుగుతుందన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పంచదార సహా పలు చిరుధాన్యాలను రైతు బజార్లు, వర్తక వ్యాపారుల ద్వారా రాయితీలపై పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, డాల్ మిల్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.