అమెరికాలో చదివించాడు రిచ్ డాడ్ జోగి రమేశ్ తన కొడుకు జోగి రాజేశ్ ను. వైకాపా జగన్ పాలనలో ఎసిబి, సిఐడి రెండూ తమ జేబు సంస్థల లెక్కన భావించేవారు. వైకాపా రెండింటినీ కక్ష సాధింపుకు అక్రమాకేసులకు వాడేది.
కానీ పూర్ డాడ్ జోగి రమేశ్ సిఐడి అధీనంలో ఉన్న భూముల మీద ధైర్యంగా కన్నేశాడు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునే ఆఫ్ట్రాల్ గా భావించి పాతిక మంది రౌడీలను వెంటేసుకొని దాడిచెయ్యడానికి వెళితే అప్పటి పోలీసు వ్యవస్థ ఈగ వాలనివ్వలేదు ఆయన మీద.
అగ్రిగోల్డ్ మీద కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వేలాదిమంది బాధితులు ఎన్నో రాష్ట్రాలలో వున్నారు. సిఐడి స్వాధీనం చేసుకున్న ఆస్తులు అమ్మినా.. మోసపోయిన బాధితులకు పరిహారం సరిపోదు.
అయినా పూర్ డాడ్ జోగి రమేశ్ ఆ ఆస్తులను ఫలహారం లెక్కన నమలడానికి ఏకంగా వాటి సర్వే నంబర్లు మార్పించి, కొడుకు బాబాయి పేరున కొట్టేసి, మళ్లీ మోసం చేస్తూ వేరే ఒక ‘రెడ్డి’కి అమ్మేసి దొంగ పిల్లి లెక్కన వుంటే.. అధికారంలో వైకాపా ఉంది కాబట్టి వ్యవస్థ గుంభనంగా వ్యవహరించింది.
ప్రభుత్వం మారింది. కోర్టుకు కూడా లెక్క చెప్పాలి కదా. అవే వ్యవస్థలు మోసాలను పూస గూర్చినట్లుగా వెలికితీసింది. అదే ఎసిబి అమెరికా నుండి చదువుకొని వచ్చిన కొడుకును బొక్కలో వేసింది.
అయ్యో మేము గౌడలు, బిసిలం, జగన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడి మాటలు వినలేక ఆయన ఇంటి మీదకు దాడికి వెళ్లినందువలన, ఇప్పుడు నా మీద కక్ష సాధింపులు చేస్తున్నారు అని పెడబొబ్బలు పెడుతున్నాడు జోగి.
కొడుకు బాబాయి పేరున కొట్టేసి అమ్మేసిన లాభం డబ్బులను గౌడ కులానికి గానీ, బీసీలకు గానీ ఖర్చుపెట్టాడా? పోనీ ఏనాడైనా వారి కోసం ఈ జోగి రమేశ్ పని చేశాడా? జగన్ రెడ్డి పాలనలో దారుణాలపై మాట్లాడితే గౌడ కులం తీర్మానించి పంపించిందా ఈయనను, చంద్రబాబు ఇంటిమీద దాడి చెయ్యమని.
వైన్ షాపులలో కూడా గౌడలకు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించాడు చంద్రబాబు. ఎందుకంటే కల్లుగీత లేకుండా ఆ కులం నష్టపోతోంది అని. ఆయన మీద కులం కార్డు తో ఇప్పుడు జోగి జోరీగ లెక్కన మాట్లాడితే అయ్యోమనే వాడుంటాడా?
అధికారం వున్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయి, కుర్చీ కైపు దిగంగానే కులం గుర్తుకొచ్చే ఘరానా భూదొంగల మాటలు ఆలకించేది ఎవరు?
అమెరికాలో ఉద్యోగానికి వెళ్ళనివ్వకుండా కేసు పెట్టారు అని ఇప్పుడు వాపోతున్న ఈ పూర్ డాడ్, ఆ అగ్రిగోల్డ్ భూములను కొడుకు పేరున కట్టబెట్టినప్పుడు, అవి కోర్టు కేసుల్లో పేర్కొన్నవి సిఐడి ఆధీనంలో ఉన్నవి అని తెలియకుండా ఇదే రిచ్ డాడ్ చేశారా అనేది ప్రశ్న?
– తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు