స్టే ఆర్డర్‌ కాపీ తెచ్చేలోపే ఆర్కే ఇల్లు కూల్చేయించాడు!

లోకేష్‌ ఎదుట చేనేత ప్రముఖుడి ఆవేదన
తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్‌ భేటీ

మంగళగిరి, మహానాడు: వైసీపీ నేత ఆర్కే తాము స్టే ఆర్డర్‌ తెచ్చుకునే లోపు ఇల్లు కూల్చేయించాడని లోకేష్‌ ఎదుట చేనేత ప్రముఖుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రము ఖులతో యువనేత నారా లోకేష్‌ గురువారం భేటీ అయ్యారు. మంగళగిరి 4వ వార్డులో నివసిస్తున్న జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకు న్నారు. వారి కుటుంబసభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలతోపాటు చేనేతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. గత ఏడాది అక్టోబర్‌ 5వ తేదీన నిర్మా ణంలో ఉన్న తమ భవనాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రోద్భలంతో అధికారులు కూల్చి వేశారని ఆవేదన చెందారు. తమ ప్రాంత వాసులంతా దశాబ్ధాలుగా ఎండోమెంట్‌ భూముల్లో నివాసం ఉంటున్నామని తెలిపారు. తాము ఇళ్లు నిర్మించుకుంటుండగా నిలిపివేయాలని ఎండోమెంట్‌ అధికారులు నోటీసులు జారీచేశారన్నారు.

వెంటనే తాము హైకోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చిందని, సంబంధిత కాపీని తెచ్చేలోపుగా అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారని వాపోయారు. లోకేష్‌ స్పందిస్తూ జగన్‌, ఆయన సామంత రాజులకు తెలిసింది కూల్చివేతలు మాత్రమేనని, అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ భూమి చూపించి దీర్ఘకాలంగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని యువనేత హామీ ఇచ్చారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుచేస్తామని, ముడిసరుకు సబ్సిడీతో పాటు చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

అనంత రం 14వ వార్డుకు చెందిన మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ కాండ్రు శ్రీనివాసరావును ఆయన కార్యాలయంలో లోకేష్‌ కలుసుకున్నారు. మంగళగిరి చేనేతలపై తమకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని, వారికి ఏ కష్టమొచ్చినా గుండెల్లో పెట్టుకుని చూసుకుం టానని తెలిపారు. అందులో భాగంగానే మంగళగిరిలో 25 అత్యాధునిక మగ్గాలతో వీవర్స్‌ శాలను ఏర్పాటు చేశామని, టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి మంచి మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని కోరారు.