రూ. 23 కోట్లతో ‘అవనిగడ్డ’లో అభివృద్ధి పనులు

– ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్

అవనిగడ్డ, మహానాడు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే అవనిగడ్డ నియోజకవర్గానికి రూ.23కోట్లు మంజూరు చేయించి డ్రైనేజీలు, పంట కాలువలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఇరిగేషన్ డీఈఈ రావెళ్ల రవికిరణ్, డ్రైనేజీ డీఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావులతో కలిసి మంగళవారం వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. మోపిదేవి మండలం కే.కొత్తపాలెం వద్ద ఎనిమిదో నెంబరు పంట కాలువ పనులు, చల్లపల్లిలో 6/1 పంట కాలువ పనులు, ఘంటసాల మండలం దేవరకోట వద్ద చిల్లల వాగు అభివృద్ధి పనులు, ఘంటసాల గ్రామం వద్ద గుండేరు మేజర్ డ్రైనేజీ పనులు, ఘంటసాల గ్రామంలో 3/2 చానల్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఘంటసాల మండల పరిధిలో గత కొన్నేళ్లుగా సమస్యాత్మకంగా ఉన్న గుండేరు మేజర్ డ్రైనేజీ, చిల్లల వాగు మైనర్ డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కావడం సంతోషదాయకం అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డ్రైనేజీల్లో తూటికాడ, గుర్రపు డెక్క పనులు చేపట్టి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అధిక వర్షాలు పడినా సమస్య రాకుండా పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఇరిగేషన్ శాఖలో ఎలాంటి నిధులు లేవని, తాను ప్రత్యేక చొరవ తీసుకొని డ్రైనేజీ, ఇరిగేషన్ పనుల కోసం రూ.23 కోట్లు మంజూరు చేయించి రైతులకు న్యాయం చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అతివృష్టితోపాటు సల్ఫ వర్షాలకే పంటలన్నీ మునిగిపోయాయని, నాలుగేళ్లుగా తాను గమనించిన సమస్యలన్నీ పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రానున్న వేసవిలో నియోజవర్గంలోని అవుట్ ఫాల్స్ స్లూయీజులు, లాకులు మరమ్మతులు చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం మాదిరిగా పనులను కాగితాలకే పరిమితం చేయకుండా… తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆచరణాత్మక రూపంలో డ్రైనేజీలు, పంట కాలువలు అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రాష్ట్రంలో ఖచ్చితంగా పారదర్శక పరిపాలన సాగాలని స్పష్టం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఘంటసాలలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ ఇంటి వద్ద చిలకలపూడి రైతులు తమ సమస్య వివరించగా వెంటనే ఉన్నత అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ ఘంటసాల మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, అయినంపూడి భానుప్రకాష్, మేకా బంగారుబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, వేమూరి రమేష్, వేమూరి గోవర్ధన్, గుత్తికొండ వంశీ, తోట్టెంపూడి పెదబాబు, పరిసే చలపతి, గొరిపర్తి సుబ్బారావు, ఏఈలు ప్రసాద్, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.