– సీఎం చంద్రబాబుకు లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ
విజయవాడ, మహానాడు: అయ్యా! కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లె రైలు మార్గంలో సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం పాసింజర్ రైళ్ళూ నడపాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ప్రతినిధి టి. లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన ఒక బహిరంగ లేఖను రాశారు. ఆ వివరాలు యథాతథంగా…
శ్రీ నారా చంద్రబాబునాయుడు,
ముఖ్యమంత్రి,
అమరావతి, ఆంధ్రప్రదేశ్
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,
నమస్తే!
అంశం: సరుకు రవాణాకే పరిమితం చేసిన కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లి రైలు మార్గంలో ప్యాసింజర్ రైళ్ళు నడిపేలా చర్యలు తీసుకోమని విజ్ఞప్తి.
కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లె రైలు మార్గాన్ని నిర్మించి, 2019లో ప్రారంభించారు. నాటి నుంచి ఆ రైలు మార్గంలో కేవలం ముడి ఖనిజ సంపద రవాణా నిమిత్తం గూడ్సు రైళ్ళను మాత్రమే నడుపుతున్నారు. రైలు మార్గాన్ని ప్రారంభించిన నాటి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు త్వరలోనే ప్యాసింజర్ రైళ్ళు ఆ రైలు పట్టాలపై పరుగులు తీస్తాయి వెల్లడించారు. ప్యాసింజర్ రైళ్లును త్వరలోనే ప్రవేశపెడతామని దక్షిణ మధ్య రైల్వే కూడా అధికారికంగా నాడు ప్రకటించింది. కానీ, ఐదేళ్ళు గడుస్తున్నా ప్యాసింజర్ రైళ్ళను నడపడం లేదు.
వెనుకబడిన రాయలసీమలోని ఆ ప్రాంతం సామాజిక – ఆర్థికాభివృద్ధికి ఈ రైలు మార్గం దోహదపడుతుందని ప్రజలు ఎంతగానో ఆశించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి, ప్రముఖ పారిశ్రామిక నగరం, కాబోయే రైల్వే జోన్ కేంద్రం విశాఖపట్నంకు కడప, రాజంపేట, కోడూరు ప్రాంతాల నుండి దగ్గరి దారిలో నేరుగా ప్రజలకు రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్ళను నడపక పోవడం అత్యంత గర్హనీయం.
రైలు మార్గం నిర్మాణం కోసం రూపొందించిన సమగ్ర అధ్యయన నివేదికలో ప్యాసింజర్ రైళ్ళను నడపడం కూడా అంతర్భాగమే. వెంకటాచలం – ఓబులవారిపల్లి మధ్య కసుమూరు, కొట్టుండిపల్లి, బ్రాహ్మణపల్లి, ఆదుర్పల్లి, నెల్లెపల్లి, రాపూరు, వెల్లికల్లు, చెర్లోపల్లి, నేతివారిపల్లి, మంగంపేట రోడ్డు, 10 స్టేషన్లు కూడా నిర్మించారు.
దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో కృష్ణపట్నం ఓడరేవు ముఖ్యమైనది. కృష్ణపట్నం ఓడరేవు నుండి నిర్మించిన రైల్వే లైన్ వెంకటాచలం రైల్వే స్టేషన్లో చెన్నై- హౌరా మెయిన్‌లైన్‌కు అనుసంధానించారు. వెంకటాచలం – ఓబులవారిపల్లె మధ్య రూ.1,993 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే లైన్ ను, చెర్లోపల్లి – వెల్లికల్లు మధ్య దాదాపు 7 కిలోమీటర్ల మేర సొరంగం మార్గంతో సహా నిర్మించడం ద్వారా చెన్నయ్ – ముంబయ్ రైలు మార్గంతో అనుసంధానించారు.
ఫలితంగా, కృష్ణపట్నం పోర్ట్ – వెంకటాచలం – ఓబులవారిపల్లె రైల్వే లైన్ రెండు ప్రధాన రైలు మార్గాలైన చెన్నై – హౌరా, చెన్నయ్ – ముంబయ్ మధ్య కీలకమైన అనుసంధాన రైలు మార్గంగా ఉన్నది. గుంతకల్ డివిజన్ నుండి కృష్ణపట్నం ఓడరేవుకు వచ్చే గూడ్స్ రైళ్లకు 72 కిలోమీటర్ల దూరం తగ్గింది. వెంకటాచలం – ఓబులవారిపల్లె మధ్య ఉన్న మొత్తం 82 కి.మీ. విద్యుద్దీకరణ పనులతో సహా రైల్వే మార్గం నిర్మించబడింది. ఈ మార్గం సరుకు రవాణాలో నికర లాభాలు గడిస్తున్నదని కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ (కెఆర్‌సిఎల్) వార్షిక నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి.
కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ (కెఆర్‌సిఎల్) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, సాగర్ మాల డెవలప్మెంట్ కార్పొరేషపన్, ఎన్ఎండిసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రయివేటు రంగంలోని కృష్ణపట్నం పోర్ట్, బ్రాహ్మణి స్టీల్స్ భాగస్వామ్యంతో 2006 అక్టోబర్ 11న “స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్.పి.వి.)”గా 114 కి.మీ. కొత్త బ్రాడ్ గేజ్ ఎలక్ట్రిఫైడ్ రైల్ లైన్ (గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్)ను కృష్ణపట్నం నుండి ఓబులవారిపల్లె వరకు నిర్మాణం, నిర్వహణ & మెంటెనెన్స్ లక్ష్యంతో కంపెనీల చట్టం, 1956 ప్రకారం నెలకొల్పారు.
కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ లో మొత్తం షేర్ క్యాపిటల్ రు.625. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రు.311 కోట్ల మూలధనం పెట్టుబడితో 49.76% వాటా కలిగి ఉన్నది. అలాగే, రు.125 కోట్ల పెట్టుబడితో సాగరమాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ కు 20%, రు.40 కోట్ల పెట్టుబడితో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్.యం.డి.సి.)కి 6.40%, రు.35 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5.6%, అంటే, ప్రభుత్వం/ప్రభుత్వం రంగ సంస్థలు 81.76% వాటా కలిగి ఉన్నాయి. ప్రయివేటు రంగంలోని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ రు.81 కోట్ల పెట్టుబడితో 12.96%, బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ రు.33 కోట్ల పెట్టుబడితో 5.28% వాటాలు కలిగి ఉన్నాయి. రెండు ప్రయివేటు కంపెనీలకు కలిపి కేవలం 18.24% వాటా ఉన్నది.
2005-06 సంవత్సరంలో మంజూరైన ఈ ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం, రైల్వే మంత్రిత్వ శాఖ కృష్ణపట్నం మార్గంలోని అన్ని ఆస్తులను కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్‌కు 30 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చిందని చెబుతున్నారు. కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లి రైల్వే లైన్ నిర్మించడానికి, నిర్వహించడానికి ఆ కంపెనీకి అధికారాన్ని దఖలు పరిచిందంటున్నారు.
ఈ పూర్వరంగంలోనే కృష్ణపట్నం పోర్ట్ ను ఆదాని సంస్థ కొన్నది. కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ ను కూడా ఆదాని తన గుప్పెట్లోకి తీసుకొని, కృష్ణపట్నం – వెంకటాచలం – ఓబులవారిపల్లి రైలు మార్గాన్ని కేవలం సరుకు రవాణా కోసమే వినియోగించుకునేలా పరిమితం చేశారని అంటున్నారు. అదే వాస్తవమైతే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉంటుందా? ఆలోచించండి.
మీరు ఈనెల ఏడో తేదీన ఢిల్లీకి వెళుతున్నారని, ప్రధానమంత్రితోపాటు రైల్వే శాఖ మంత్రిని కూడా కలవబోతున్నట్టు ప్రసారమాధ్యమాలలో చూశాను. విశాఖపట్నం – విజయవాడ – వెంకటాచలం – ఓబులవారిపల్లె – రాజంపేట – కడప మార్గంలో ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రవేశపెట్టి, రాయలసీమ ప్రాంత సామాజిక-ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని మిమ్ములను కోరుతున్నాను.
– టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక
విజయవాడ
తేదీ: అక్టోబరు 4, 2024