– టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామంలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఆమె పాల్గొని, మాట్లాడుతూ ఉత్తమ నాయకుల స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో కక్షలకు, కారణ్యాలకు దూరంగా కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి పల్లెను అభివృద్ధి చేసుకుందామన్నారు. గ్రామాల్లోని ప్రతి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, నేను మీ ప్రతినిధిగా మాటిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువత భవితగా స్ఫూర్తి ప్రదాతగా ఉన్న నారా లోకేష్, ఐదేళ్ళ వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్ర పాలనను గాడిలోకి తెచ్చేందుకు చేస్తున్న నిరంతర యజ్ఞం మీరు చూస్తున్నారన్నారు.
ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అనేక అద్భుతాలు సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. గత వైసీపీ పాలన చూస్తే కుంభకోణాలు, విధ్వంసాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో రాష్ట్ర లో పాలన గాలికి వదిలేశారని మండిపడ్డారు. చివరికి తిరుపతి లడ్డులో కూడా అపచారాన్ని కలుగజేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ నాయకులు జవాబుదారి పాలన సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. వంద రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం ఇంకా అనేక సూపర్ సిక్స్ పథకాలలో అమలు చేయాల్సినవి త్వరలో అమలు చేసేందుకు కృషి జరుగుతుందని ఆయన వివరించారు. దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి ప్రజా సేవలో ఉంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ శాసన మండల సభ్యుడు పరుచూరి అశోక్ బాబు, ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, దర్శి నగర్ పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, బీజేపీ నియోజకవర్గ నాయకులు తిండి నారాయణ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుసుమ కుమారి, గ్రామ సర్పంచ్ ఆరేటి శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.