రూరల్ ఎంప్లాయిమెంట్ తో పల్లెల అభివృద్ధి

– విద్యార్థులు గ్రామాల్లో రీసెర్చ్ చేయాలి
– ఐఎస్‌ఎఫ్‌ అంకుర యాత్ర ప్రారంభంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

వడ్డేశ్వరం, మహానాడు: కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు రూరల్ గ్రామాల్లోని రైతుల సమస్యలు, క్రిమి కీటకాల నివారణ వంటి అంశాలపై రీసెర్చ్ చేయాలి. వాటి ద్వారా రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలకు నాంది పలకాలి. ఇలా రూరల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయగలితే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్(ఐఎస్‌ఎఫ్‌) వారి అంకుర యాత్ర ప్రారంభ కార్యక్రమానికి శనివారం హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టార్ట్ అప్ ఎకో సిస్టం ద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని, కాలిఫోర్నియా మాదిరిగా ఏపీలోనూ స్టార్టప్ లు తీసుకొచ్చేందుకు ఐఎస్‌ఎఫ్‌ ప్రయత్నం చేస్తోందని చెప్పారు.

వ్యాపారానికి వయసుతో సంబంధం లేదు
వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి వయసుతో సంబంధం లేదని, తాను విద్యార్థిగా ఉంటూనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టానని పెమ్మసాని వివరించారు. తొలుత 20-30 మంది విద్యార్థులకు బోధించానని, అమెరికా అంతటా తన మెటీరియల్ చదవాలనే లక్ష్యంతో పని చేశానని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఇదే లక్ష్యంతో పారిశ్రామిక రంగంలో అడుగు పెట్టాలని సూచించారు. ఇతర దేశాల్లో అవలంభిస్తున్న పారిశ్రామిక విధానాలను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

త్వరలో mygunturmp.in
ప్రజల కోసం త్వరలో mygunturmp.in పోర్టల్ ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ప్రాజెక్టుల గురించి తెలియజేస్తే ప్రభుత్వపరంగా సహకారం అందించేందుకు కృషి చేస్తాం అని పెమ్మసాని అన్నారు. అనంతరం అంకుర యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐఎస్‌ఎఫ్‌ చైర్మన్, ఫౌండర్ డాక్టర్ జేఏ చౌదరి, కేఎల్ వర్సిటీ చైర్మన్ డాక్టర్ కోనేరు సత్యనారాయణ, ఐఎస్‌ఎఫ్‌ కో-ఫౌండర్లు దీనానంద్, సత్యేంద్ర, శివమహేష్, శ్రీకాంత్, కేజీఎంజీ మేనేజింగ్ పార్టనర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.