– జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్‌కు బాధ్యతల అప్పగింత
– విధుల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసిన డిల్లీరావు
ఎన్‌టీఆర్ జిల్లా నూతన కలెక్టర్‌గా జి.సృజనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్‌కు అప్పగించి రిలీవ్ అయినట్లు ఎస్.డిల్లీరావు తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఎన్‌టీఆర్ జిల్లాకు తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి.. రెండేళ్లకు పైగా జిల్లాకు సేవలందించడంలో సహకరించిన జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు, ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు ఇతర అధికారులు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు డిల్లీరావు తెలిపారు. విధుల నిర్వహణ పరంగా ఈ రెండేళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు.
ప్రజా కలెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకొని..:
భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా కీలకప్రాంతమైన ఎన్‌టీఆర్ జిల్లాకు తొలి కలెక్టర్‌గా చేరిన దగ్గరి నుంచి డిల్లీరావు తమదైన శైలిలో పనిచేస్తూ అనతి కాలంలోనే ప్రజా కలెక్టర్‌గా గుర్తింపు సాధించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేవారు. తమ సమస్యను చెప్పుకునేందుకు ఎవరు ఎప్పుడు వచ్చినా చిరునవ్వుతో పలకరించి.. సావధానంగా విని అప్పటికప్పుడు పరిష్కారానికి సంబంధిత అధికారులకు మార్గనిర్దేశనం చేసేవారు.
గౌరవ ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులతో పాటు ఇతర ప్రముఖల పర్యటనల సందర్భంలో సమర్థవంతంగా ప్రోటోకాల్, ఆతిథ్యం, అధికారుల సమన్వయం, సమీక్షా సమావేశాల ఏర్పాట్లు.. ఇలా ప్రతి విషయంలోనూ సూక్ష్మ ప్రణాళికతో పనిచేసి ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రముఖుల మన్ననలు పొందారు.
ఎన్నికల సమర్థ నిర్వహణలోనూ ప్రత్యేక గుర్తింపు
సాధారణ ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారిగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ఓటర్ల జాబితా రూపకల్పన దగ్గరి నుంచి పోల్డ్ ఈవీఎంలను, ఇతర సామగ్రిని సీల్ వేసి భద్రపరచడం వరకు ప్రతి దశలోనూ సమర్థవంతంగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.
విజయవాడలో రెండు విడతల్లో జరిగిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) కీలక సమీక్షా సమావేశాలకు పటిష్ట ఏర్పాట్లు చేసి ఈసీఐ మన్ననలు పొందారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు ఓటింగ్ శాతం పెంచేలా ఓటర్లను జాగృతం చేయడంలో వినూత్నంగా వ్యవహరించి కలెక్టర్ డిల్లీరావు సఫలీకృతులయ్యారు.