రోడ్ సేఫ్టీ అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ
– ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట, మహానాడు : ప్రాణం అనేది అత్యంత విలువైంది.. దాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత మనపైనే ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో భద్రత ముఖ్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రోడ్డు సేఫ్టీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.కె.దుర్గ పద్మజ రూపొందించిన రోడ్డు భద్రతా అవగాహన పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదం అంటే కుటుంబం మొత్తం రోడ్డున పడటమేనన్నారు.గత కొద్ది కాలంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు.ప్రజలు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని,మన భద్రతను మనమే చూసుకోవాలని సూచించారు. ఇలాంటి విషయంలో అవగాహన కల్పించేందుకు ఎన్జీవోలు ముందుకు రావడం సంతోషకరం అన్నారు.
ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ఫోర్ వీలర్ నడిపే వారు సీటు బెల్టు ధరించడం తప్పనిసరిగా పాటించినపుడే మన జీవితాలకు మనం రక్షణ కల్పించుకున్న వాళ్లమవుతాం అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదం అన్నారు. సరైన అనుమతులు లేకుండా వాహనాలు నడపడం కూడా చట్టరీత్యా నేరమని, అత్యంత ప్రమాదకరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సభ్యులు వేంకటేశ్వర రావు, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.