ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకువెళ్ళొచ్చు!

– గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
– స్థానిక అవసరాలకు ట్రాక్టర్ లలోనూ ఉచిత ఇసుక తరలింపునకు అనుమతి
– సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
– ఇప్పటి వరకు ఎడ్ల బండికి మాత్రమే అనుమతి

విజయవాడ, మహానాడు: ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం ట్రాక్టర్లకూ అవకాశం కల్పిస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇసుక పాలసీలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు ఇసుక కొరత రావదన్న ఉద్దేశంతో స్థానిక అవసరాలకు వాడుకునేలా ప్రభుత్వం ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించింది.

ఇసుక లభ్యత లేదన్న కారణంతో ఇంటి నిర్మాణాలు ఆగిపోరాదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వుల్లో తెలిపారు. స్థానిక అవసరాలకు సరిపడేంత మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అవసరమైనవారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.