ఊపందుకున్న పారిశుద్ధ్య పనులు

– 3,454 మంది కార్మికులు, 450 ఆరోగ్య సిబ్బంది నిమగ్నం

విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పురపాలక శాఖ వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలయ్యాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది కార్మికులను విజయవాడ కు రప్పించారు. బుధవారం సాయంత్రం 4 గంటలవరకూ రోడ్లపై చెత్తను తొలగించేందుకు విధుల్లో 4498 మంది కార్మికులు పాల్గొన్నారు. 48 ఫైర్ ఇంజన్ ల ద్వారా వీధుల్లో, ఇళ్ళల్లోకి చేరిన మురుగును తొలగిస్తున్నారు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా సహాయక చర్యలు ప్రభుత్వం చేపడుతోంది. మొత్తం 149 సచివాలయాల పరిధిలో ఉన్న 32 వార్డుల్లో వరద ప్రభావం ఉంది.