లాస్య నందితకు శాస‌న‌ స‌భ సంతాపం.. సభ రేపటికి వాయిదా

హైద‌రాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ప‌ట్ల శాస‌న‌ స‌భ సంతాపం ప్ర‌క‌టించింది.. ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. స‌భ ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కాగా, లాస్య నందిత మృతిప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్ర‌వేశ‌ పెట్టారు. ఈ సంద‌ర్భంగా లాస్య నందిత సేవ‌ల‌ను, ఆమె తండ్రి సాయ‌న్న సేవ‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

సాయన్న తనకు అత్యంత ఆప్తుడని, చాలా ఏళ్లు కలిసి పనిచేశామని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లాస్య నందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్యనందిత చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వారు చేయాలనుకున్న పనలను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. లాస్య మృతికి సంతాపం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రేవంత్ పేర్కొన్నారు.

అనంత‌రం శాస‌న‌ స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, సునీతా ల‌క్ష్మారెడ్డి, ముఠా గోపాల్, రాజశేఖ‌ర్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్, కూనంనేని సాంబ‌శివ‌ రావు, ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి, పాయ‌ల్ శంక‌ర్, మ‌క్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ గ‌ణేశ్.. లాస్య నందిత మృతి ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని బ‌ల‌పరిచారు.