Mahanaadu-Logo-PNG-Large

వైసిపి నేతల భూకబ్జాల నుంచి కాపాడండి

-ప్రజాదర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న విన్నపాలు
-తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశం

అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే ఉండవల్లిలోనే చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజరోజుకు ప్రజలనుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిగ్గా వారినుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమదృష్టికి సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలిస్తున్నారు. శనివారం నాడు నిర్వహించిన ప్రజాదర్బార్ లో పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి.

వైసిపినేతల భూకబ్జాల నుంచి కాపాడండి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తమ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో పలువురు బాధితులు నారా లోకేష్ ను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ అండతో చావలి ఉల్లయ్య తన 16.5సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని, తిరిగి ఇప్పించాలని మంగళగిరి మండలం యర్రబాలెంకు చెందిన ఆలా సాంబశివరావు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి ఏకైక ఆధారమైన స్థలాన్ని వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేశారని, తన స్థలం తిరిగి ఇప్పించాలని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లికి చెందిన కురవ మద్దయ్య అనే వృద్ధుడు నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. కర్నూలు పట్టణంలో తాను కొనుగోలు చేసి, కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న 7.50 సెంట్ల స్థలాన్ని పిట్టం నాగ సుధాకర్ రెడ్డి, పరిగి మాధవి ఆక్రమించారని యువనేతకు విన్నవించారు. పేదిరికంలో ఉన్న తమకు కబ్జాదారులపై పోరాడే శక్తి లేదని, వైసీపీ ప్రభుత్వంలో పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమను ఆదుకోవాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న ఉండవల్లి – రేవేంద్రపాడు రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని, జగన్ రెడ్డి నివాసం ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాలు అడ్డుపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రహదారికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని వడ్డేశ్వరం, ఉండవల్లి, తాడేపల్లి, కుంచనపల్లి, రేవేంద్రపాడు వాసులు వినతిపత్రం సమర్పించారు. వైసిపి బాధితుల సమస్యలను విన్న యువనేత తక్షణమే స్పందించి.. సదరు ఫిర్యాదులను సంబంధిత శాఖకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కళ్యాణమస్తు పథకం కింద సాయం చేయండి
తన కుమార్తెకు ‘కల్యాణమస్తు’ పథకం కింద ఆర్థికసాయం అందించాలని తాడేపల్లికి చెందిన గోలి వెంకట భావనా రుషి కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించారని, ఇందుకు అయిన ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజురు చేయించి ఆదుకోవాలని బాపట్ల జిల్లా నల్లూరి పాలెంకు చెందిన కృష్ణమోహన్ విన్నవించారు. మంగళగిరి మండలం నిడమర్రుకు చెందిన కొందరు వ్యక్తులు మద్యం అమ్మకాలకు పాఠశాల విద్యార్థులను వినియోగిస్తున్నారని, దీనిని అరికట్టాలని గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. భర్త చనిపోయిన తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక సాయం అందించాలని తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన కే.నిర్మల, తన కుమారుడికి వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన వికలాంగ పెన్షన్ పునరుద్ధరించాలని యర్రబాలెం గ్రామానికి చెందిన భీమవరపు శ్రీనివాసరావు కోరారు. ఎంసీయే చేసిన తనకు ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన లీలావతి విజ్ఞప్తి చేశారు. అమరావతి కోసం భూములిచ్చిన తమకు రెండేళ్ల నుంచి కౌలు రావడం లేదని, తిరిగి మంజూరు చేయాలని నిడమర్రుకు చెందిన ఉన్నం నాగరాజు విన్నవించారు. ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీఏపీడబ్ల్యూ అసోసిషయేషన్ ప్రతినిధులు కోరారు. ఇంజినీర్ ఇన్ చీఫ్, పంచాయతీ రాజ్, విజయవాడ హెచ్ వోడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 3600 మద్యం దుకాణాల్లో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 12వేల మందికి ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.