పని వేళల్లో కార్యదర్శులు సచివాలయంలో ఉండాలి

* అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు
* ఆకస్మిక తనిఖీల్లో కమిషనర్ హరికృష్ణ ఆగ్రహం

గుంటూరు, మహానాడు: నగరంలోని వార్డు సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తూ, పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీదనంతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) కె.హరికృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ సంపత్ నగర్ లోని 59, 60, 61, 62, 67, 68 వార్డ్ సచివాలయాలను డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.

తొలుత హాజరు రిజిస్టర్లు తనిఖీ చేసి సచివాలయ కార్యదర్శుల హాజరు సక్రమంగా లేకపోవడం, పని వేళల్లో మూవ్మెంట్ రిజిస్ట్రర్ లో నోట్ చేయకుండా వెళ్ళడం గమనించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి వార్డ్ సచివాలయాలు ఆకస్మిక తనిఖీలు చేస్తామని, కార్యదర్శులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించకుంటే చర్యలు తప్పవన్నారు. కార్యదర్శులు స్థానిక సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి సచివాలయం పరిధిలోనే చర్యలు తీసుకోవాలని, అప్పుడే సిబ్బంది స్థానికులకు సత్సంబంధాలు ఉంటాయన్నారు.

అలాగే ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సచివాలయంలో కార్యదర్శులు అందరూ అందుబాటులో ఉండి, ప్రజల నుండి అందే ఆర్జీలను తీసుకోవాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ప్రజల సర్వీస్ రిక్వస్ట్ లు పెరగాలన్నారు. వివిధ ప్రభుత్వ సేవల కోసం ప్రజలు చెల్లించే సర్వీస్ చార్జీల రుసుంను ఎప్పటికప్పుడు సంబందిత ప్రభుత్వ అకౌంట్ కి జమ చేయాలన్నారు. సచివాలయం పరిధిలో ఇంటి, కుళాయి పన్నులను నూరు శాతం వసూళ్లు చేయడంలో కార్యదర్శులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యదర్శి తమ విభాగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని తెలిపారు.