ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోందని, దీనిని క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ సీఐ సింగయ్యను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిఐతో సమావేశం నిర్వహించి, అరండల్ పేట, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందని, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదని సీఐ దృష్టికి ఎమ్మెల్యే తీసుకుని వచ్చారు. చుట్టుగుంట సమీపంలోని వీఐపీ రోడ్డులో హెవి లోడ్ తో లారీలు తిరుగుతున్నాయని, దీని వలన ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చినదని, దీనికి పరిష్కార మార్గాలు చూడాలని ఎమ్మెల్యే కోరారు. అరండల్ పేట సండే మార్కెట్ జరుగు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు అధికంగా ఉన్నాయని అటు చిరువ్యాపారులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కార మార్గం చూడాలని సీఐని ఆదేశించారు.