క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలి

– మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, మహానాడు: క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయ అడ్మిన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని, పింఛన్ల పంపిణీ సజావుగా సాగేందుకు వారు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు. సచివాలయానికి అడ్మిన్ నాయకుడు లాంటివాడని, సచివాలయంలోని మిగిలిన సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బందరు అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

బందరును ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా బంగారు బందరు కార్యక్రమంతో శ్రీకారం చుట్టామని, నగరంలోని ప్రతి డివిజన్ ను స్వచ్ఛ డివిజన్ గా తయారు చేయడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నామని, ఆ దిశగా సచివాలయ ఉద్యోగులు పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రతి సచివాలయ ఉద్యోగి వారి పరిధిలోని సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని, అందుకు ప్రతిరోజు వారు క్షేత్రస్థాయిలో సందర్శించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, అంగన్వాడీ, మున్సిపాలిటీ పాఠశాలలకు మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన నిధులను సమకూరుస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, దానిని సద్వినియోగం చేసుకునే విధంగా పట్టభద్రులకు ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ గొర్రెపాటి గోపీచంద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, ఇలియాజ్ బాషా, పల్లపాటి సుబ్రహ్మణ్యం, తలారి సోమశేఖర్, పలువురు కార్పొరేటర్లు, సచివాలయ అడ్మిన్లు తదితరులు పాల్గొన్నారు.