జగన్‌ ప్రభుత్వంలో మున్సిపల్ సిబ్బందికి తీవ్ర అన్యాయం

• ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పథకాలను కట్ చేసిన వైనం
• లబోదిబోమంటూ గ్రీవెన్స్ లో అర్జీలు ఇస్తున్న వైసీపీ బాధితులు

విజయవాడ, మహానాడు: జగన్‌ ప్రభుత్వంలో మున్సిపల్ సిబ్బందికి తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు బాధితులు బోరుమన్నారు. తమకు న్యాయం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చారు. తాము విజయవాడ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో భాగమైన వెహికల్ డిపోలో సుమారుగా 27 ఏళ్ళుగా మెకానికులుగా, హెల్పర్లుగా, ఎలక్ట్రిషన్ లుగా, వెల్డర్ లుగా ఇలా అన్ని విభాగాలలో ఎంతో శ్రద్ధగా మరమ్మతులు చేస్తూ మా విధులను నిర్వహిస్తున్నామని తెలిపారు.

హెవీ వెహికిల్స్ కు డ్రైవర్స్, క్లీనర్స్ కు యూజీడి వర్కర్స్ కు, పారిశుద్ధ్య స్లీపర్స్ కు 2024 మార్చి ఒకటోతేదీ నుండి జీతాలు పెంచారని… మేము ఎంతో ప్రమాదకరమైనటువంటి వ్యర్థాల మధ్యలో అనేక వాహనాలకు మరమ్మతులు చేస్తున్నా మమ్మల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న తమకు అన్ని ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వం కట్ చేసిందని బోరుమన్నారు. దయ ఉంచి ప్రభుత్వ పథకాలు అందించి తమను కూడా క్లీన్ ఎన్విరాన్మెంట్ లో కలిపి జీతాలు పెంచాలని కోరారు. ఈ మేరకు పలువురు బాధితులు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మాజీ మంత్రి కెఎస్ జవహర్, టీడీపీ నాయకుడు శివప్రసాద్ ల ముందు విన్నవించారు.

అక్రమ కేసులు, భూ కబ్జాలు, ఫించన్ తొలగింపు సమస్యలు, కొత్త పింఛన్ లు, ఆర్థిక సాయం, సీఎం ఆర్ ఎఫ్, మున్సిపల్ అద్దెషాపుల సమస్యలు, భూ ఆన్ లైన్ సమస్యలు, గత ప్రభుత్వంలో నిర్మించిన భవనాలకు రాని బిల్లులు, అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు, నామినేటెడ్ పదవులు ఇలా వందల ఫిర్యాదుతో నేడు గ్రీవెన్స్ కు అర్జీదారులు తరలి వచ్చారు. తమ సమస్యను విన్నవిస్తూ… న్యాయం చేయాలంటూ కోరారు. ఆయా సమస్యలను విన్న నేతలు సంబంధిత అధికారులకు వెను వెంటనే ఫోన్లు చేసి పారదర్శకంగా ఉన్న ఇష్యూలను వెంటనే క్లియర్ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఎడ్యూకేషన్, హోంశాఖ ఇలా సంబంధి శాఖలకు అర్జీలను పంపి పరిష్కరించాలని ఆదేశించారు.

• పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరుల భూ బాధితులు రోజుకొకరు బయటకు వస్తున్నారు. నేడు రాయవారిపల్లి గ్రామానికి చెందిన నరసింహలనాయుడు కుమారుడు హరీష్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి అనచరుడు మోహన్ రెడ్డి సాగునీటి కాలువను పూర్తిగాపూడ్చి రోడ్డు వేయడంతో చెరువులోకి పోవాల్సిన వర్షం నీరు తన పొలంపై పారుతొందని దాంతోగత ఐదేళ్లుగా తాను పూర్తిగా పంటను నష్టపోవాల్సి వచ్చిందని వాపోయాడు.

• గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేయలేదని… తనను అక్రమంగా ఏసీబీ ట్రాప్ లో ఇరికించి సర్వీసు నుండి తొలగించారని… దాంతో తన భార్యకు మతిస్థిమితం సక్రమంగా లేదని.. తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతొందని.. తన బిడ్డకు కూడా ఆరోగ్యం సరిగ్గా లేదని. తనకు న్యాయం చేయాలంటూ తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సెర్ప్ డిపార్ట్ మెంట్ కు చెందిన తిప్పాన గోవిందరావు తెలిపారు.

• గత ప్రభుత్వంలో ఎలిమెంటరీ స్కూల్‌ లో చదువుతున్న 1 నుండి 5 తరగతి పిల్లలను 3వ తరగతి నుండి హైస్కూలుకు మార్చారని దానివలన స్కూలు బిల్డింగ్ లు నిరుపయోగంగా మారాయని పిల్లలు పల్లెల్లో, పట్టణాల్లో సుమారు 1 నుండి 2 కిలోమీటర్లు జాతీయ రహదారులపై నడిచి వెళ్లవలసిన పరిస్థి కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కావున వైసీపీ తెచ్చిన విద్యావిధానాన్ని రద్దు చేసి 2014 లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ విద్యా విదానంను అమలు చేయాలని టీఎన్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి దర్శనపు స్వతంత్ర కుమార్ కోరారు.

• కడప జిల్లా మైలవరం నవాబు పేట గ్రామానికి 2008 లో దాల్మీయా సిమెట్ ఫ్యాక్టరీ వచ్చిందని ఆ ఫ్యాక్టరీ సున్నపురాయి కొరకు 2,300 ఎకరాల భూమిని సర్వే చేసి 2000 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని.. మిగిలిన 300 ఎకరాల భూమి కోనుగోలు చేయకపోవడంతో తాము నష్టపోతున్నామంటూ ఆ భూ బాధితులు వాపోయారు. గత 14 సంవత్సరాల నుండి ఫ్యాక్టరీ నుండి వచ్చే డస్ట్ తో ఆ 300 ఎకరాల్లో పంటలు పండటంలేదని నవాబు పేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

• వైసీపీ ప్రభుత్వం వచ్చాక తాము టీడీపీ అని దివ్యాంగుడైన తన కొడుకు పింఛన్ తొలగించారని తన కొడుక్కు వైసీపీ హయాంలో తొలగించిన పింఛన్ ను పునరుద్ధరించాలని కర్నూలు జిల్లా బేతం చెర్ల కొలుముల పల్లె గ్రామానికి చెందిన ఎన్. సులోచన దేవి కోరారు.

• తమ యందు దయ ఉంచి మాయొక్క సర్వీను దృష్టిలో పెట్టుకుని గతంలో ఇచ్చిన జీవో ఎంఎస్‌ నెం. 8 తేదీ 16.03.2024 ప్రకారం పేర్కొనబడిన బోధనేతర కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్దీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

• గత ప్రభుత్వంలో నాయకులు అధికారుల సహకారంతో పబ్లిక్ ఓపెన్ ప్లేస్ నందు అక్రమ నిర్మాణాలు చేపట్టారని… ఫ్లాట్ల మధ్య పబ్లిక్ ఓపెన్ స్పేస్ నందు ఏవిధమైన కట్టడాలు కట్టకూడదని హైకోర్టు నిబంధనలు ఉన్నా పట్టించుకోలేదని.. కావున ఆ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని కొవ్వూరు మండలం నందమూరు గ్రామం పశివేదలకు చెందిన ఈ. గీతతో పాటు పలువురు విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వెంటనే మంత్రి సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి ఆదేశించారు

• మాజీ పారా మిలిటరీ సంక్షేమం సంఘం (సీఏపీఎఫ్‌ కేంద్ర హోం శాఖ సాయుధ బలగాలు) సభ్యులు విజ్ఞప్తి చేస్తూ… తాము మిల్టరీ ఉద్యోగులతో సమానంగా పనిచేసినా.. ఆర్మీ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత కల్పించే బెన్ఫిట్స్ తమకు కల్పించడంలేదని… దయ చేసి రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సీఎం చంద్రబాబు తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.

• కర్నూలు జిల్లా కల్లూరు మండలం పంచలింగా గ్రామానికి చెందిన అనుగొండ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేస్తూ… తమ కాలనీలో 20 కుటుంబాలకు మూడు సంవత్సరాలుగా కరెంట్ సదుపాయం లేక చీకట్లలో మగ్గుతున్నామని… కరెంట్ స్తంభాలు వేసినా కరెంట్ లైన్ లాగకపోవడంతో కరెంట్ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. దయ చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించి తమ ఇళ్లలో చీకట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశాడు.

• ఉర్థూ మీడియం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు ఇప్పటి వరకు లిమిటెడ్ రిక్రూట్ మెంట్ పెట్టలేదని.. ఇప్పుడు లిమిటెడ్ రిక్రూట్ మెంట్ పెట్టడం వలన డీఎస్సీ 2018 లో క్వాలిఫైడ్ అయిన మెరిట్ అభ్యర్థులైన తమకు అన్యాయం జరుగుతుందని గ్రీవెన్స్ లో వారు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

• నిడదవోలు మున్సిపాలిటీలో ఇండస్ట్రీయల్ జోన్ నుండి రెసిడెన్సియల్ జోన్ కు మార్చమని అర్జీ పెట్టుకుని కన్వర్షన్ ఛార్జెస్ రూ.3,21,400 కట్టినా గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని మరిడి అరుణ వాపోయారు.. తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.

• పసుపులేటి కనకదుర్గ, పసుపులేటి అనంతలక్ష్మీలు వాపోతు తమకు ఉద్యోగం ఇప్పిస్తామని తమ దగ్గర రూ. 7 లక్షలుడబ్బులు తీసుకుని హెల్త్ డిపార్ట్ మెంట్ కు చెందిన బి. నాగేశ్వరరావు (జంగారెడ్డిగూడెం), ఏ అశోక్, బీ.రాంగోపాల్ లు మోసం చేశారని నేడు గ్రీవెన్స్ లో వినతిని అందించింది. తమను మోసం చేసిన వారిని శిక్షించి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.

• ప్రజా ఆరోగ్యం పరిరక్షణ కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ (ఏపీజీఈఎన్‌సీవో), డొంకరాయి, మోతుగూడెం గ్రామాలలో ప్రవేశ పెట్టిన రక్షిత మంచినీటి పథకాలను వైసీపీ నేతలు స్వలాభం కోసం 2021 లొ తీయించారని. ప్రజా ఆరోగ్యం కోసం పెట్టిన వాటిని.. సీజనల్ వ్యాదులు సోకి అవస్థలు పడకుండా ఏర్పాటు చేసిన వాటని మళ్లీ ఏర్పాటు చేయాలని అర్జీదారులు విన్నవించారు.

• తాను నీట్ పరీక్షకు దరకాస్తు చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బదులుగా అరుణాచల ప్రదేశ్ అని పొరపాటున పడిందని కావున నీట్ పరీక్ష రిజల్ట్ లో ఏపీ స్టేట్ ర్యాంక్ లో తన పేరు చూపించడంలేదని దయ ఉంచి తనకు స్టేట్ ర్యాంక్ లలో తన పేరు వచ్చేటట్టు చూడాలని నెల్లూరుకు చెందిన ఎండ్లూరి అభిజ్ఞ శ్రీహర్షిణి విజ్ఞప్తి చేసింది.