( మార్తి సుబ్రహ్మణ్యం)
మనకు స్వాతంత్య్రం వచ్చి సంబురాలు చేసుకుంటున్న శుభవేళ.. మన వల్ల స్వాతంత్య్రం పొందిన పొరుగు దేశమైన బంగ్లాదేశీయులు.. మన జెండాలు, హిందువులను చెరబట్టి దేవాలయాలను ధ్వంసం చేస్తున్న విషాదం. కత్తులతో పిల్లల ముందే తండ్రుల కుత్తుకలు కోస్తున్న అరాచకం.
అక్కడ మైనారిటీలయిన హిందువులపై రాక్షసులు కూడా ఈర్ష్యపడే రీతిలో జరుగుతున్న మారణకాండ..హిందూ మహిళలను భర్త-పిల్లల ఎదుటే చెరబట్టి, ఉరికొయ్యలకు వేళ్లాడదీస్తున్న రాక్షసకాండ.. చదువుకునే పిల్లలను పై నుంచి కిందకు బలవన్మరణం పాల్జేస్తున్న కిరాతక దృశ్యాలు… హిందూ మహిళల మానంలో యాసిడ్‌పోసి వికటాట్టహాసం చేస్తున్న ముష్కరుల హాహాకారాలు, మనసున్న ప్రతి గుండెనూ కదిలించాయి. ప్రపంచదేశాలనూ కదిలించాయి. మనదేశంలో ఒక్క సెక్యులరిస్టుల ముసుగేసుకున్న కుహనా వామపక్ష-మానవహక్కుల మూకలకు తప్ప!
మనవల్ల స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న బంగ్లాదేశీయులు, ఇప్పుడు మనదేశం వారిపైనే హత్యాకాండకు పాల్పడుతుండటం విశ్వాసఘాతకమే. పేదరికంలో మగ్గుతున్న బంగ్లాదేశీయులకు ఉట్టి పుణ్యానికి ఆహారధాన్యాలు పంపిస్తూ, వారిని పందెం కోళ్లమాదిరి మేపుతున్న మన నాయకత్వ లౌకికత్వానికి.. బంగ్లా మూకలు తగిన దక్షిణ చెల్లించుకుంటున్నారు. బంగ్లాలో పైకి కనిపిస్తున్నది రిజర్వేషన్ల పోరాటమయినప్పటికీ.. జరుగుతున్నది మాత్రం, భారతవ్యతిరేక పోరాటమేనన్నది మనం మనుషులం అన్నంత నిజం.
రిజర్వేషన్ల పోరాటం కాస్తా భారత-హిందూ వ్యతిరేక చర్యల దిశగా సాగడం, భారతీయులకు ఆందోళ న కలిగించే అంశమే. అల్లరిమూకలు ప్రధాని నివాసం సహా, హిందూ దేవాలయాలు, హిందూ మహిళలను చెరబట్టి కుత్తుకలు కోసేంత రాక్షసోన్మాదం దిశగా సాగుతుండటం బట్టి.. ఆ ఉన్మాద చర్యల్లో అమెరికా-పాకిస్తాన్-చైనా వికృత హస్తాలున్నట్లు అర్ధమవుతుంది.
ఇలాంటి ఉన్మాద చర్యలకు, సాధారణ విద్యార్ధులు పాల్పడే అవకాశమే ఉండదు. అంటే ఇప్పుడు విద్యార్ధుల ముసుగులో.. మైనారిటీలయిన హిందువులపె,ై కిరాతకాలకు పాల్పడుతున్నదంతా భారత వ్యతిరేక శక్తులేనన్నది నిష్ఠుర నిజం. ఈ ముసుగులో సంఘవ్యతిరేకశక్తులు దేశంలోకి చొరబడేందుకు చేస్తున్న యత్నాలను మన దళాలు తిప్పికొట్టుడుతున్నాయి. దీనిని మన సెక్యులర్ పక్షులు అంగీకరించకపోవచ్చు.
బంగ్లాదేశ్‌లో దశాబ్దాల నుంచి స్థిరపడిన మైనారిటీ హిందువులకు ఇప్పటిీ హక్కులు లేవు. రక్షణ అంతా కంటే లేదు. కాకపోతే పాకిస్తాన్‌తో పొలిస్తే కొంత మేలు. అయినా పుట్టిన గడ్డను వీడలేక హిందువులంతా అక్కడే సర్దుకుపోతున్న పరిస్థితి. అయినప్పటికీ, ఈ స్థాయిలో వారిపై మున్నెన్నడూ గతంలో ఉన్మాదచర్యలు జరిగిన దాఖలాలు లేవు. కారణం బంగ్లాకు భారత్ మిత్రదేశం కావడమే. భారత్‌కు మిత్రురాలిగా ముద్రపడ్డ అక్కడి ప్రధాని హసీనా, ప్రాణాలరచేతిలో పెట్టుకుని భారత్‌కు వచ్చిందంటే.. బంగ్లాను భారత వ్యతిరేక శక్తులు ఏ స్థాయిలో చెరబట్టాయో కనిపిస్తూనే ఉంది.
హసీనా పారిపోయిన తర్వాత.. బంగ్లా పూర్తిగా భారతవ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లినట్లు, జరుగుతున్న కిరాతకాలు చెబుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల ఉద్యమానికి, హిందూ మహిళలపై హత్యాచారాలకు సంబంధం ఏమిటి? విద్యార్ధుల నిరసనలకు- హిందూ దేవాలయాల విధ్వంసాలకూ సంబంధం ఏమిటి? విద్యార్ధుల డిమాండ్లకు- భారత్ మానవీయకోణంలో బంగ్లాకు పంపిన అంబులెన్సులపై ఉన్న ఇండియా జెండాను ధ్వంసం చేయడానికి సంబంధం ఏమిటి?.. అంటే ఇప్పుడు బంగ్లాలో జరుగుతున్నది, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమమా? భారత వ్యతిరేక ఉన్మాదోద్యమమా?బంగ్లాలో మైనారిటీ హిందువులపై జరుగుతున్న మారణకాండ, మహిళలపై హత్యాచారాలు, చిన్నపిల్లల ఊచకోత, హిందూ ఆలయాల విధ్వంసాన్ని ప్రపంచం మొత్తం ఖండించింది. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో భారత్‌కు భాసటగా ర్యాలీలు జరుగుతున్నాయి. విదేశీయులు సైతం బంగ్లాదేశీయుల ఉన్మాదాన్ని, చూపుడువేలితో నిలదీస్తున్నారు. బంగ్లాలో హిందూ మైనారిటీలకు రక్షణ కల్పించాలని గొంతెత్తి నినదిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా.. బంగ్లాలో హిందువులపై మారణకాండ నిర్నిరోధంగా, నిర్భయంగా జరుగుతున్నా.. హిందూ మహిళలపై బంగ్లా మెజారిటీ ముష్కరుల హత్యాచారాలు సోషల్‌మీడియాలో ప్రపంచం మొత్తం దర్శిస్తున్నా… మన దేశ సెక్యులర్ మీడియా, సెక్యులర్ పార్టీలు, వామపక్ష సెక్యులర్ మేధావులకు మాత్రం వారి వేదన-రోదన మాత్రం వినిపించకపోవడం క్షమార్హం కాదు. పెద్ద గొంతుల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే మానవ హక్కుల సంఘం నేతలు ఎక్కడ సుఖనిద్రపోతున్నారో.. ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారో తెలియదు.
కాశ్మీర్‌లో టెర్రరిస్టులను సైనికదళాలు నేలకూల్చినప్పుడు.. మైనారిటీలపై ఎక్కడైనా దాడులు జరిగితే కొంపలుకూలేంత గొంతుపెట్టుకుని, టన్నులకొద్దీ న్నీరు కార్చుకునే మానవహక్కుల సంఘాలు, మైనారిటీ నేతలు.. మరి అదే మైనారిటీలయిన హిందువులపై బంగ్లా రాక్షసమూకలు బరితెగిస్తుంటే స్పందించకుండా.. ఎందుకు నవరంధ్రాలు మూసుకున్నారన్నది భారతజాతి సంధిస్తున్న ప్రశ్న. జవాబు చెప్పే దమ్ముందా?
మణిపూర్‌లో చర్చిలపై దాడులు జరిగినప్పుడు.. ఢిల్లీలో రైతులు ఆందోళన జరిపినప్పుడు… మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు.. కాలేజీలో హిజాబ్ వ్యవహారాన్ని రోజంతా భూతద్దం పెట్టి చూపించే మనదేశ సెక్యులర్ మీడియా.. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులు, దేవాలయాలపై నిర్నిరోధంగా దాడులు జరుగుతున్న వైనాన్ని, అరనిమిషం కూడా చూపించకుండా మౌనంగా ఉండటం కిరాకతకం. బహుశా ఆ ఘటనలు టెలికాస్టు చేస్తే, వారి సెక్యులిలరిజం మడిబట్టలు అపవిత్రమవుతాయన్న భయం కామోసు!
సరే.. మీడియా అంటే హిందువులపై జరిగే దాడులు చూపిస్తే.. మైనారిటీలు ఎక్కడ సున్తీ చేస్తారేమోనన్న భయంతో, నవరంధ్రాలూ మూసుకుందనుకోవచ్చు. మరి కాంగ్రెసు, సమాజ్‌వాదీపార్టీ, డిఎంకె, బీఎస్పీ, టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్ లాంటి పార్టీలకు ఏమైందన్నది హిందూ సమాజం సంధిస్తున్న ప్రశ్న. మణిపూర్‌లో చర్చిలపై దాడి జరిగినప్పుడు సముద్రమంత కన్నీటితో ఏడ్చిన కాంగ్రెస్‌కు.. బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు కనిపించకపోవడమే వింత. ఒక శశిథరూర్ మాత్రమే ఈ విషయం ధైర్యం చేయడం మెచ్చదగ్గదే.
మరి సోనియా-రాహుల్-ఖర్గే-ప్రియాంక మౌనం సంగతేమిటి? బంగ్లాలో హిందూ మైనారిటీలపై రోజుల తరబడి నిర్నిరోధంగా దాడులు, హత్యాచారాలు, గృహదహనాలు, దేవాలయాల విధ్వంసాలు జరుగుతున్నా ఒక్క పార్టీ ఖండిస్తే ఒట్టు. మైనారిటీలకు రక్షణగా ఉంటానన్న మజ్లిస్ ఎక్కడ? ఒక్క హైదరాబాద్‌లోని ముస్లిములే మైనారిటీలా? బంగ్లాలో ఉన్న హిందువులు మైనారిటీలు కారా? వారికి హక్కులు-రక్షణ అవసరం లేదా?
మానవహక్కులు-మైనారిటీల హక్కుల గురించి గొంతుచించుకునే ఒక సీతారాం ఏచూరి, ఇంకో ప్రకాష్‌కారత్, మరో నారాయణ ఎక్కడ తొంగున్నారు? బర్కాదత్, రాజ్‌దీప్ సర్దేశాయ్, ప్రణయ్‌రాయ్, రాఖీ, సల్మాసుల్తాన్, రవీష్‌కుమార్ వంటి మోతుబరి జర్నలిస్టుల నోళ్లు ఫెవికాల్‌తో ఎందుకు మూసుకున్నాయి?
ఆ మాటకొస్తే దేశభక్త ఎన్డీయే భాగస్వామ్య పక్షాలదీ భయానక మౌనరాగమే. ఎన్డీఏ భాగస్వామ్యపార్టీలు కూడా ఇప్పటిదాకా బంగ్లామారణకాండపై పెదవి విప్పితే ఒట్టు. కారణం మైనారిటీల ఓట్లు పోతాయన్న భయం. దక్షిణాదిలో జనసేన పార్టీ దళపతి పవన్ కల్యాణ్ ఒక్కరే, బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఆ దమ్ము మిగిలిన పార్టీలకు ఏదీ?
రోజూ హిందూ ధర్మం, దేశం గురించి టీవీలలో మఠం వేసుకుని మాట్లాడే స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాథిపతులు, హిందూ సంస్థలు, జాతీయవాదులనబడే పెద్దమనుషులు ఏ దేవాలయాల్లో చక్కెరపొంగలి-పులిహోర తింటున్నారు? అసలు హిందుత్వంపై పేటెంటీ తీసుకున్న భాజపా.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలయిన హిందువులు-బౌద్దులు-క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నేరుగా ఎందుకు ఖండించడం లేదు?
మిగిలిన పార్టీలకంటే సెక్యులర్ పైల్స్ ఉన్నాయనుకుందాం. బంగ్లా గురించి మాట్లాడితే ముస్లిముల ఓట్లు పోతాయన్న భయం ఉండవచ్చు. మరి హిందుత్వ బ్రాండు ఉన్న కాషాయపార్టీకి ఏమైంది? బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ధైర్యంగా ఎందుకు ఖండించడం లేదు? కాషాయ పార్టీ దానిని ఖండించినా-ఖండించకపోయినా ముస్లిములు ఎలాగూ ఆ పార్టీకి ఓటు వేయనప్పుడు ఎందుకీ మొహమాటం? ప్రభుత్వంగా బంగ్లా ప్రధాని హసీనాను, ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకువచ్చి ఆశ్రయం ఇచ్చిన ఎన్డీయేకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ.. ఒక రాజకీయపార్టీగా మాత్రం, బంగ్లా దురాగాలపై ఎందుకు గళం విప్పడం లేదని ప్రశ్నించిన వారే లేకపోవడం వింత.
అంటే దేశంలో సెక్యులరిజం సిగ్గుపడుతోందన్నమాట. అందుకే.. అసలు రాజ్యాంగంలోని ఆ సెక్యులర్ అనే పదాన్నే తొలగిస్తే.. పార్టీలు-మేధావులు-మీడియా కింద ఉన్న ఈ సెక్యులర్ అనే ‘పైల్స్’ బాధ ఎవరికీ ఉండదు కదా? ఈ ఆర్శమొలల వల్లే కదా వీరి మొహమాటం అన్నది బుద్ధిజీవుల ఉవాచ.