Mahanaadu-Logo-PNG-Large

అది పీఠం కాదు.. భూముల శఠగోపం

-స్వరూపా భూకేటాయింపు రద్దు చేయాల్సిందే
-స్వరూపానందకు ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి
-శారదాపీఠం ఆస్తులపై సీబీఐ,ఈడీ లతో విచారణ జరపాలి
-శారదాపీఠాన్ని రద్దు చేయాలి
-ఏపీ సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి -శ్రీనివాసానంద,జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్
– భీమునికొండ భూములు పరిశీలించిన శ్రీనివాసానంద స్వామి బృందం

విశాఖపట్నం: శారదాపీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయింప జేసుకొన్న 15 ఎకరాల భూకేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద, జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.

మంగళవారం పలువురు స్వాములతో కలసి వీరు భీమిలి మండలం కొత్త వలస గ్రామం సర్వే 102-2 , 103 లలో స్వరూపానందకు భీమునికొండపై కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఈ భూకేటాయింపులు స్వరూపానంద వేద పాఠశాల ముసుగులో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేయించుకొన్నారని ఆరోపించారు.

అసలు పీఠానికే గుర్తింపు లేనప్పుడు, వేద విద్యార్ధులే ఇక్కడ శిక్షణ పొందనప్పుడు, జగన్ ప్రభుత్వం గుడ్డిగా 15 ఎకరాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూములను వ్యాపార అవసరాలకు వాడతామని శారదాపీఠం ఉత్తరాధికారిగా చెప్పుకొనే సాత్మానంద, మూడు నెలల క్రితం ప్రభుత్వానికి లేఖ రాసి తమ ఉద్దేశాలను బహిర్గతం చేశారని, ఈ లేఖ ఆధారంగా కేటాయింపులను నిముషంలో రద్దు చేయవచ్చని చెప్పారు.

భీముడు కూర్చన్న స్ధలం అది..
స్వరూపానంద కు కేటాయించిన భూమి పాండవులలో ఒకరైన భీముడు కూర్చున్న స్ధలం అని స్ధానికులు నమ్మకమని, దానిని తవ్వకాలు, కట్టడాల పేరిట ధ్వంసం చేయడం తగదని అన్నారు. భీముని పట్నానికి పేరు కూడా భీముడి వల్లే వచ్చిందని గుర్తుచేశారు. స్వరూపానందకు కేటాయించిన స్ధలంలో అత్యంత విలువైన ఔషధ మొక్కలు, చిన్న చిన్న అటవీ జంతువులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నదని అన్నారు.

రెండు కోట్లతో రోడ్డు వేసిన అధికారులపై చర్యలు
స్వరూపానంద కోసం రెండు కోట్లతో ఆయనకు కేటాయించిన భూమికి ఘాట్ రోడ్ వేసిన వీఎంఆర్డీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులను గుర్తించి ఈ రెండు కోట్ల రూపాయలను వారి నుంచి రికవరీ చేయాలని కోరారు. రహదారి కోసం తవ్విన గ్రావెల్ ను కోట్ల రూపాయలకు అమ్ముకొన్నట్లు ఆరోపణలు వున్నందున దానినీ రికవరీ చేయాల్సిన అవసరం వుందని శ్రీనివాసానంద, మూర్తి యావద్ లు అన్నారు. ఇప్పటికే కొండ ను చాలా వరకూ ధ్వంసం చేశారని ఇకపై జరగకుండాచూడాలని కోరారు.

శారదాపీఠాన్ని రద్దు చేయాలి
స్వరూపనంద చరిత్ర, వారసత్వం, ధర్మాధికారి వంటివి ఏమీ లేకుండా కేవలం ఆధ్మాత్మికత ముసుగులో సందపాన కోసం ఏర్పాటు చేసి పెందుర్తి శారదాపీఠాన్ని రద్దు చేయాలని వారు డిమాండు చేశారు. శారదాపీఠం ముసుగులో పెద్ద ఎత్తున అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయని వాటిన్నింటిపై విచారణ జరపాలని కోరారు.

చినముషిడివాడలో గెడ్డను కబ్జా చేసి నిర్మించిన శారదాపీఠం స్వాముల ఆస్తులు ఇప్పుడు వేల కోట్లకు చేరాయని వీటిపై సీబీఐ, ఈ డీ విచారణ జరపాలని డిమాండు చేశారు. ఫిక్స్ డ్ డిపాజిట్ లు వంద కోట్లకు చేరినా ప్రభుత్వానికి సోర్స్, లెక్క చెప్పడం లేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్ధ నిర్వాహకుడు తురగా శ్రీరామ్, పలువురు స్వాములు, మాతాజీలు పాల్గొన్నారు.