అన్న క్యాంటీన్ కు శిష్ట్లా లోషిత్ రూ. కోటి విరాళం!

– పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయం: మంత్రి లోకేష్

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ శిష్ట్లా లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు కోటి రూపాయలు విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ కు ఈ మేరకు రూ. కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ శిష్ట్లా లోహిత్ ను అభినందించారు. లోహిత్ ఇప్పటికే కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ గా సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్న క్యాంటీన్ల కోసం లోహిత్ లాంటి పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదన్నది చంద్రబాబు ఆశయమని పేదల ఆకలి తీర్చేందుకు ఎంత ఖర్చుచేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

యువనేత శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ… అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలు నరకం చూశారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో వారి కళ్ళల్లో ఆనందం కనబడుతోందని చెప్పారు. చంద్రబాబునాయుడు, లోకేష్ ల స్ఫూర్తితో ఇకముందు కూడా సంక్షేమ కార్యక్రమాలకు తమవంతు సహాయ, సహకారాలు అందిస్తానని చెప్పారు.