ఆపన్నులకు శ్రీ భ్రమర ట్రస్ట్ ఆపన్న హస్తం

– ఎంబిబిఎస్ చదువు కోసం విద్యార్థినికి ఆర్థిక భరోసా కల్పించిన రామచంద్రరావు

విజయవాడ, మహానాడు: ఒడిశా రాష్ట్రం నుండి ఎన్నో ఏళ్ల క్రిందట గుంటూరు నగరానికి వచ్చి స్థిరపడిన కృష్ణానంద్ సింగ్ కుమార్తె శృతి సింగ్ అనే పేద విద్యార్థిని ఎంబిబిఎస్ చదువు నిమిత్తం ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నదని ఓ పత్రిక కథనం ద్వారా తెలుసుకున్న శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత రామచంద్రరావు వెంటనే స్పందించారు. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్డు లోని తమ కార్యాలయంలో రామచంద్ర రావు, మాధవి దంపతులు విద్యార్థినితో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థిని భవిష్యత్తుకి భరోసాన్ని కల్పించారు. ఈ సందర్భంగా గళ్ళా రామచంద్రరావు ఏమన్నారంటే… చదువుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ క్రమంలో మంచి ప్రతిభ ఉన్నా కూడా సరైన ఆర్థిక స్థోమత లేకపోవడం వలన అనేక మంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇదే క్రమంలో గుంటూరు నగరానికి చెందిన శృతి సింగ్ అనే విద్యార్థిని తండ్రి లేకపోవడం వలన, తల్లి కష్టం మీద చదువుకున్నారు.

శృతి సింగ్ డాక్టర్ చదవాలని గొప్ప కల అది నెరవేరాలంటే ఖచ్చితంగా ఆర్థిక సహకార అవసరం ఉంది అని తెలుసుకుని ఈరోజు శ్రీ భ్రమర ట్రస్టు ద్వారా ఆ విద్యార్థినికి ఆర్థికంగా అండగా నిలబడాలని నిశ్చయించుకున్నాను. మంచి ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కాబట్టి శృతి సింగ్ 5ఏళ్ల ఎంబిబిఎస్ చదువుకు అయ్యే కాలేజీ ఫీజులు మొత్తం కూడా శ్రీ భ్రమర ట్రస్ట్ ద్వారా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాం అని గళ్ళా రామచంద్ర రావు తెలిపారు.

భవిష్యత్తులో విద్యార్థి మంచి డాక్టర్ గా ఎదిగి, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని గళ్ళా రామచంద్రరావు తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మాట్లాడుతూ శ్రీ భ్రమరా ట్రస్ట్ ద్వారా అనేకమంది ఆపన్నులకు ఆపన్న హస్తం అందిస్తూ నేడు ఎంతో ఉన్నతమైన విద్యను పేదలకి చేరువ చేయడంలో ఎంతో కృషి చేసిన శ్రీ భ్రమరా ట్రస్ట్ సభ్యులను అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే  తెలిపారు.