బీజేపీపై విమర్శలను తిప్పికొట్టాలి

-రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌

విజయవాడ, మహానాడు: ఎన్నికల సందర్భంగా బీజేపీపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజే పీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానల్‌ సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సందర్భంగా అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులు నిర్వర్తించాల్సిన పాత్రపై సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ మీడియా కేంద్రాలుగా ఉన్న విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలులో మీడియా సెంటర్లను ఇందుకోసం సిద్ధం చేయాలని తెలిపారు. కూటమిలో పోటీ చేస్తున్న ఆరు ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరికీ తెలిసే విధంగా టీవీ డిబేట్‌లలో అనుసరిం చాల్సిన వ్యూహాలపై వివరించారు. అభ్యర్థులపై అధికార పార్టీ పెడుతున్న కేసుల విషయంపై అధికార ప్రతినిధులు తక్షణం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విషయాలు, పొత్తు ధర్మం లో మూడు పార్టీలతో సమన్వయంతో ప్రత్యర్థి పార్టీని బలహీన పరచడానికి అనుసరించా ల్సిన వ్యూహంపై చర్చించారు. ఎన్నికల సమన్వయకర్త పేరాల శేఖర్‌ జీ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, భాను ప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌, ఆర్‌.డి.విల్సన్‌, సాధినేని యామినిశర్మ, పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.