పండుగలు-పర్వముల శృంఖలలో దీపావళి అన్నింటికంటే పెద్ద పండుగ. ఎందుకంటే ఈ పండుగలో ఒకేమారు ఐదు పండుగలు జరుపుకోబడతాయి. ఈ పండుగను జరుపుకోవటానికి ప్రజలు ఐదురోజులను కేటాయిస్తారు. అందుచేత చాలా ఆడంబరముగా,, అట్టహాసంగా జరుపుకొంటారు.
ఆశ్వీజ బహుళపక్ష త్రయోదశినాడు ధన త్రయోదశి పండుగ వస్తుంది. దీనిని ధన్వంతరీత్రయోదశి అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయుర్వేదమునకు దేవత యైన ధన్వంతరి జయంతి ఆనాడే అని చెపుతారు. కనుక దీనిని ధనత్రయోదశి లేదా ధన్వంతరీత్రయోదశిగా పిలుస్తూ పండుగను జరుపుకునే ఆచారము వున్నది.
ఈనాడు ఓ వైపు ఆరోగ్య సంవర్థనార్థం భగవాన్ ధన్వంతరిని పూజిస్తూ వుంటారు. మరోప్రక్క లక్ష్మీ-కుబేరుల పూజ పూర్తి చేసి, ధన సమృద్ద్ధులు సుస్థిరంగా వుండాలని వేడుకుంటారు. వర్తమాన కాలంలో ‘ఆరోగ్యమే మహాభాగ్యముగా చెప్పబడినది. అదే సత్యము కూడా! ఎందుకంటే మన సమస్త ధర్మాచరణకు సాధనము మన శరీరమే! శరీరములో ప్రాణము పోయినప్పుడు దానిని నిధనము అనే పదముతో పిలుస్తారు. అందుచేత ధనత్రయోదశినాడు ఆరోగ్యసంవర్ధన కొరకు
ప్రార్ధన చెయ్యబడుతుంది.
ఆనాడు ప్రజలు తమ శక్త్యానుసారము వస్తువులు, బంగారము – వెండి ఆభరణములు, నాణెములు, లక్ష్మీగణేశ మూర్తులను, ఇంకా ఎన్నెన్నో సామానులను కొనుగోలుచేసి ఇంటికి తెచ్చుకుంటారు. ఈ వస్తుసామాగ్రి అంతా లక్ష్మీ రూపములో చూడబడుతుంది. ధనత్రయోదశి సందర్భముగా. వాటిని పూజించటం కూడా జరుగుతుంది.
ఇంతేకాకుండా ప్రజానీకమంతా తమతమ గుమ్మాల ముందు, ముఖ్య ద్వారబంధముల ముందు యమధర్మరాజు నిమిత్తము నూనెదీపాలను వెలిగించి పెడతారు. ఈ దీపమును
‘యమదీపము’ అన్న పేరుతో పిలుస్తారు. ఎందుకంటే కుటుంబ సభ్యులెవ్వరూ అపమృత్యు వాత పడకూడదు అన్న ఉద్దేశ్యముత్రో అలా చెయ్యటం పరిపాటి.
ఆ మరునాడు ఆశ్వీయుజ కృష్ణపక్ష చతుర్దశి. దాన్ని రూపచతుర్దశి లేక నరకచతుర్దశి అని పిలుస్తారు. నరకాసురుడు అను రాక్షసుడి ఆగడాల నుండి ప్రజలను రక్షించటానికి
శ్రీకృష్ణ పరమాత్మ అతనిని వధించి లోకానికి ముక్తిని ప్రసాదించినాడు.
చతుర్దశి రోజున సౌందర్యరూపుడైన శ్రీకృష్ణుడిని పూజిస్తారు. తత్భలితముగా తమకు కూడా నిష్కల్మషము,అందము ప్రాప్తిస్తాయి. ఈ భావనతో కృష్ణ ఆరాధన చెయ్యబడుతుంది. ఆనాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని స్నానమాచరించుటకు విశేష ప్రాధాన్యత ఇవ్వబడినది.
ఒంటికి నువ్వులనూనె రాసుకుని అలక్ష్మి తొలగిపోవాలని వేడుకుంటారు. ఆనాటి నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగామాత ఆవహించి వుంటారు. కనుక తలంటు పోసుకుని పాపవిముక్తులవ్వాలని కోరుకుంటారు. ఆరోజు యమదేవుడి ప్రీత్యర్ధం ఇంటి గుమ్మం ముంగిట దీపం వెలిగించే ఆచారం కూడా వున్నది. ఆ మరుసటిరోజున ఆశ్వీజ అమావాస్యనాడు దీపావళి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోబడుతుంది. ఇలా ఐదురోజులపాటు దీపావళిపర్వమును జరుపుకుంటారు కనుక దీనికి కావల్సిన ఏర్పాట్లు ముందే మొదలు పెట్టబడతాయి.
ఇల్లూవాకిలి శుభ్రం చేసుకోవటం, ఇంటికి కొత్త రంగులు వేసుకోవటం, ఇంటిని అందముగా అలంకరించుకోవటం, ఇంటికి-గుమ్మాలకు ముందు రంగవల్లికలు తీర్చిదిద్దుకోవటం
చేస్తారు. దీపావళినాడు ఇంటి నలువైపులా అందము,కొత్తదనము కానవస్తుంది. రాత్రివేళ లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, అలాగే గణపతి ని పూజిస్తారు. అంతకంటే ముందు మట్టిదీపాలను వెలిగించి ఇల్లంతా కాంతులు వెదజల్లేటట్లుగా అమరుస్తారు.
అంతే కాకుండా రకరకాల పిండివంటలు, మిఠాయిలూ వండివాటిని భగవంతుడికి నివేదించి ఆ ప్రసాదమును అందరూ పంచుకుని తింటారు. వీటి తర్వాత బాణాసంచా కాలుస్తారు.
టపాసులు, చిచ్చుబుడ్గు ,కాకరపువ్వొత్తులు, మతాబులు కాల్చి ఆ వెలుగులను చూస్తూ ఆనందడోలికల్లో తేలియాడతారు. దీపావళినాడు ఇల్లంతా దీపకాంతులతో శోభిస్తూవుంటుంది. ఇలా ప్రకాశమయముగా వుంచడం చేత లక్ష్మీదేవి ప్రసన్నురాలై తన కృపను అందరిమీదా వర్షింపజేస్తుంది.
దీపావళిపండుగ ఊర్జా, ప్రకాశము, ఉత్సాహము మేళవింపుతో తొణికిసలాడే పండుగయే ఐనా ఈ పండుగనాడు లక్ష్మీదేవితో పాటు భగవానుడు గణపతి మరియు సరస్వతీ మాతను సైతం పూజించటంలో గల అంతరార్థము ఏమనగా,,మనము సద్భుద్ధిని, సద్వివేకమును ధారణ చేయాలి, . అప్పుడే లక్ష్మీదేవి కరుణ మనమీద నిలిచివుంటుంది అని. మనిషి సధ్భుద్ధిని, సద్వివేకము ఆచరణ లో పెట్టకుండా తన ధనమును దుర్వినియోగం చేసి,అశుభ కార్యముల లో పురోగమిస్తాడు. అమరత్వము వైపు, సత్తు వైపుగా ముందుకు
సాగుతాడు. అందువలన ఓ వెలుగుతున్న దీపమును మన అంతర్మనస్సులో సైతం స్తాపించుకోవాలి. అంతేకాకుండా తేజోమయ రూపుడైన ఆ వరమేశ్వరుడిని మనకు సరైన మార్గమును చూపించమని వేడుకుంటూ మన అంతర్మనస్సులో ధ్యానించాలి.
దీపావళి మరుసటిరోజు అనగా కార్తీక శుక్ల పాడ్యమినాడు (బలిపాడ్యమి) గోవర్ధన పూజ చెయ్యబడుతుంది.
గోవర్ధన పూజలో గోధనము అనగా గోపూజ చేస్తారు. దానితో పాటు ఆవుపేడతో గోవర్ధననాథుడి ప్రతిమని తయారుచేసి ఆయనను కూడా పూజిస్తారు. ఆయనను ప్రసన్నుడిని చేసుకునేందుకు అన్నపు రాశిని ఏర్పాటు చేసి నివేదిస్తారు. ఈనాడు చేయబడే పండుగ విశేషించి గోవంశాభివృధ్దికై నిర్దేశించబడినది.
ఓ పౌరాణిక కథను అనుసరించి ఇంద్రుడు పెద్ద జడి వానతో గోకులవాసులను భయభీతులను చేయ ప్రయత్నించాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు గోవర్ధనపర్వతమును తన చిటికెనవేలుపై ఎత్తి పట్టుకుని గోకులవాసులను ఇంద్రుడి కోపం నుండి రక్షించాడు. ఇక ఆనాటి నుండి ఇంద్రుడిని పూజించే బదులు గోవర్ధనగిరిని పూజించే విదానము ఆరంభమైనది. ఇన్ని సంవత్సరముల తరువాత కూడా ఆ పరంపర నేడూ కొనసాగుతున్నది.
కార్తీక శుక్ల పాడ్య మి మరునాడు శుక్షషక్ష విదియ రోజున భగినీహస్తభోజనము జరుపుకోబడుతుంది. ఆనాడు అక్కచెల్లెళ్ళు తమ సోదరుల ఆరోగ్యము, దీ ర్ఘాయువు ని ఆకాంక్షిస్తూ పూజ-అర్చనలు చేస్తారు. పిమ్మట సోదరులకు తిలకమును దిద్ది వారిని మృష్టాన్న భోజనము తో సంతృప్తి పరుస్తారు ఈవిధముగ దీపావళిలో భాగమైన ఈ ఐదు పండుగలు ఆరోగ్యము-సమృద్ధి-ప్రకాశముల అవతరణ, గోవంశ సంరంక్షణ, ధాన్య సమృద్ధి మరియు బంధాలు గాఢముగా ముడివడి ఉండాలి అనే సందేశమును ఇస్తాయి.
అనువాదం : శ్రీమతి లక్కరాజు లక్ష్మీ రాజ గోపాల్.