పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు!

– గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– సీఎం బాబుతోనే గ్రామాలకు పూర్వ వైభవం
– మంత్రి సవిత

మరువపల్లి, మహానాడు: ఉపాధి హామీ పథకం రాష్ట్రాలకు జీవం పోషిందని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజక వర్గం పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ మరువపల్లి గ్రామంలో 86 లక్షల నిధులతో ఆదివానం పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనతో పల్లెలకు పూర్వ వైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలునిర్వహిస్తున్నామన్నారు.

మొదటి దఫా పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. త్వరలోనే రెండో దఫా నిధులను కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటినుండే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు.

గత ప్రభుత్వం తప్పిదలవల్ల రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేక అన్ని రంగాలను నిర్వీర్యం అయ్యాయని మంత్రి విమర్శించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచులకు అధికారం లేకుండా చేయడమే కాకుండా కుంటుపడిన అభివృద్ధికి వారిని బాధ్యులను చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామనికి సర్పంచ్లకు పూర్తిగా అధికారమిచ్చి సర్పంచుల గౌరవం ఇచ్చిందన్నారు.