Mahanaadu-Logo-PNG-Large

తిరుమల కొండపై లెక్కకు మించి పాపాలు

స్వరూప పీఠానికి పప్పుబెల్లాల్లా భూములు
అనుమతులు లేకుండానే నిర్మాణాలు
బాబు సర్కారు చర్యల కొరడా ఝళిపిస్తుందా?

(వాసు)

ఐదేళ్లలో తిరుమల కొండపై లెక్కకు మించి పాపాలు. వసతి గదుల నుంచి దర్శనం టికెట్ల వరకు అంతా రాజకీయం. అవినీతే రాజ్యం. శారదా పీఠానికి ప్రభుత్వ భూములను మిఠాయిల్లా పంచిపెట్టారనే ఆరోపణలు. కాల్వను కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఆగ్రహాలు. ఇంతకీ తిరుమల కొండపై ఐదేళ్లపాటు ఏం జరిగింది? వాటన్నింటిని చంద్రబాబు ప్రభుత్వం ఎలా సెట్ చేయగలదా?

వడ్డించేవాడు మనవాడైతే.. పంక్తిలో ఎక్కడ కూర్చున్న పర్వాలేదు. మనకు రావాల్సినవి వస్తాయి. రావనుకున్నాయి కూడా వస్తాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ శారద పీఠం. ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ శారదాపీఠం అధిపతి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన స్వామిజీ స్వరూపానందేంద్ర. ఆ సమయంలో ఎంత పేరు వచ్చిందో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వివాదాలను ఎదుర్కొంటున్నారు. కారణం ఆ పీఠం దక్కించుకున్న భూములు.. వారికున్న పొలిటికల్ లింక్స్.

నిన్నటి వరకు విశాఖ భూములపై రచ్చ జరిగింది. ఈలోగా వెలుగులోకి తిరుమల భూముల అంశం వచ్చి చేరింది. ఒక్క తిరుమలే కాదు.. అమరావతిలో యాగం చేసిన ప్రదేశానికి సమీపంలో మరోచోట.. ప్రకాశం జిల్లాలో ఇంకోచోట.. భూములను కేటాయించింది జగన్ ప్రభుత్వం. దీనిపై ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి.తిరుమలలో ధర్మ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టింది శారదాపీఠం.

అయితే ఈ నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తుందన్నది ఆరోపణలు. ఇన్నాళ్లు ఈ అక్రమాలను చూసి కూడా చూడనట్టుగా వదిలేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. వాస్తవానికి ఏ బ్లాక్‌లో నాలుగు అంతస్థలుకు పర్మిషన్‌ తీసుకుని ఐదు అంతస్థులు కట్టారు.ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు తిరుమల క్షేత్ర రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్.

హైకోర్ట్ పిటిషన్‌పై విచారణ చేసి కమిషన్‌ ఏర్పాటు చేయడం.. ఆ కమిషన్‌ విచారణ చేపట్టడం.. అక్రమాలు బయట పడటం.. ఇలా వరుసగా జరిగిపోయాయి. తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర చేసిన అక్రమాలపై పలువురు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదా పీఠం మఠాన్ని స్వామీజీలు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలుగా తేల్చేశారు. శారదా పీఠాధిపతి ఆక్రమించిన భూములతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించాలని వీరి డిమాండ్.

ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి స్వామివారికి సేవ చేసుకోవడానికి, భక్తులకు ఉపయోగపడేందుకు మాత్రమే మఠాలను కేటాయిస్తారు. కానీ వాటిని నిర్వహిస్తున్న వారు మాత్రం కొండపై పెద్ద ఎత్తున భక్తుల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలలో జనసేన నేతలతో కలిసి కిరణ్‌ రాయల్‌ పలు మఠాలను సందర్శించారు. కోట్ల రూపాయాల స్కాం జరుగుతోందని ఆరోపించారు.

స్వరూపానంద స్వామి రూల్స్‌ను అతిక్రమించి స్టార్‌ హోటల్‌ను తలపించేలా కొండపై అక్రమ కట్టడాలను కట్టడం ఏంటని ప్రశ్నించారు. తిరుమలలోని శారదా పీఠం నిర్మాణాలను కూల్చివేయాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నిర్మాణాలు ఏంటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

మరీ ముఖ్యంగా గోపురం కంటే ఎత్తులో భవనాలు ఎలా నిర్మిస్తారని భక్తులు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం శారదా పీఠంపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.