దేశం గర్వించదగ్గ రాజనీతిజ్ఞులు సీతారాం ఏచూరి

– లావు శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరు, మహానాడు: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఉండాలని సైద్ధాంతిక సిద్ధాంతాలతో పోరాడిన దేశం గర్వించ దగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రజా పోరాట యోధుడు, మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిని కోల్పోవడం బాధాకరమని లోక్ సభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్ సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో సోమవారం జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

ప్రధాన వక్తగా విచ్చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికై రాజకీయాలలో ప్రవేశించి, అంచెలంచలుగా ఎదిగి తెలుగు వాడైనా సీతారాం ఏచూరి కేరళ, బెంగాల్ రాష్ట్రాలను అధిగమించి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కు జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు ఎన్నిక కావడం గొప్ప విషయం అన్నారు.

వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ భారతదేశంలో లౌకికవాదం, ఫెడరలిజం, ప్రజాస్వామ్య విలువల కోసం ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ పోరాటం సీతారాం ఏచూరి నిర్వహించారన్నారు. కుల, మత, ప్రాంతీయ ఉన్మాదాలకు వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కుల కోసం పోరాడిన మహనీయులన్నారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జె.డి. శీలం ప్రసంగిస్తూ సీతారాం ఏచూరితో కలిసి రాజ్యసభలో 11 ఏళ్ళపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలపై చర్చించుకునే వారమన్నారు. శాసన మండలి సభ్యుడు కె.యస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ 1977 నుండి 2024 మధ్య భారత రాజకీయాలలో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ వామపక్ష పార్టీలు వారి భావజాలాలలో , ఆచరణలో పునరాలోచన చేసుకోవాలని, వామపక్షాల ఐక్యత పెరగాలని కోరారు. సంస్మరణ సభ ప్రారంభంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఒక నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ శాసన సభ్యుడు లింగం శెట్టి ఈశ్వరరావు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులుడు సిరిపురపు శ్రీధర్ శర్మ , నేస్తం సహ వ్యవస్థాపకుడు టి. ధనుంజయ రెడ్డి, చరిత్ర సంఘ అధ్యక్షులు ప్రొఫెసర్ శామ్యూల్, ఎల్ఐసి యూనియన్ నేత సురేష్, చావ శివాజీ, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓ . నారాయణరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజా గాయకులు పివి .రమణ సీతారాం ఏచూరి జీవిత విశేషాలపై ఆలపించిన పాట సభికులను ఆలోచింపజేసింది.