సీతారాం ఏచూరి మృతి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్: ప్రముఖ మార్క్సిస్టు నేత, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి ప్రగఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు కూనంనేని తెలిపారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు.

కామ్రేడ్‌ సీతారాం ఏచూరి మరణం బాధాకరం

–సురవరం సుధాకర్‌ రెడ్డి

సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి మరణ వార్త చాలా బాధ కలిగించింది. ఆయన నిమోనియా (శ్వాసకోస వ్యాధి) ఆలిండియా ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో చికిత్స తీసుకుంటారని తెలిసినా, కోలుకుంటారని భావించాను. సీతారాం ఏచూరి ముందు హైదరాబాద్‌ నిజాం కాలేజీలో చదివారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో చదువుతూ మార్క్సిస్టు పార్టీలో చురుకైన కార్యకర్తగా మారారు. అంచలంచెలుగా ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యత స్వీకరించారు. మంచి వక్త. ఆయన అనేక సమకాలిన సమస్యలపైన గ్రంథ రచనలు చేశారు. ఆయన తెలుగు, ఇంగ్లీష్‌, హిందు, తమిళం, బెంగాలి, తదితర భాషలలో మాట్లడగలిగేవారు. 2004లో వామపక్షాలు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలపర్చినప్పుడు కామన్‌ మినమ్‌ ప్రొగ్రామ్‌ (కనీస ఉమ్మడి కార్యక్రమం) తయారు చేయడంలో కామ్రేడ్‌ ప్రకాశ్‌ కారత్‌, సీతారాంఏచూరి, ఏబి బర్దన్‌, డి.రాజా కలిసి పనిచేశాం. ఆయన ప్రధాన కార్యదర్శి అయిన తరువాత వామపక్షాల ఐక్యతను విస్తృతం, పటిష్టం చేసేందుకు మంచి కృషి చేశారు.