‘సామాజిక బాధ్యత’ ను చట్టబద్ధం చేయాలి

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు …. ‘సమాజం ‘ అంటే ….ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో నివసిస్తున్న జనం . వారు- తమ పనులు తాము చేసుకుంటూ …బతికినంత కాలం సుఖం గా జీవనం గడపడానికి చేయగలిగినదంతా చేయడమే ప్రభుత్వ బాధ్యత . అందుకే , ఐదేళ్ళ కోసారి వారు ప్రభుత్వ నిర్వాహకులను ఎంపిక చేసుకునేది .

వారికి తగిన ఉపాధి వనరులు కల్పించాలి .వారికి తగిన ఆవాసాలు కల్పించాలి . వారి భూముల్లో అనువైన పంటలు పండించుకోడానికి తగిన వసతులు కల్పించాలి . వారి ఉత్పత్తులు అన్యాక్రాంతం కాకుండా రక్షణ కల్పించాలి . వారి పొలాలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయించాలి . వారికి అత్యంత విశ్వసనీయమైన వైద్యసేవలు అందుబాటులో ఉండే విధమైన చర్యలు తీసుకోవాలి . వారి గ్రామాలు …..పట్టణాల మధ్య రాకపోకలకు అనువైన రహదారులు ఏర్పాటు చేయాలి . రవాణా సదుపాయాలు వారికి అందుబాటు లో వుండాలి . వారి పిల్లలకు అత్యుత్తమ విద్యావ్యవస్థలను అందుబాటులో ఉంచాలి .

ఇవన్నీ “ప్రభుత్వం” చేయాలి . ఇదే…..ప్రభుత్వ సామాజిక బాధ్యత . ఇందుకోసమే ” ప్రభుత్వం” అనే అదృశ్య వ్యవస్థ ఉండేది.దాని పేరు మీద అధికారం చెలాయించేవారిని ఎన్నుకునేది . మరి , ఈ “సామాజిక” బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించగలుగుతుందా ?చేయలేకపోతే ; చేయించగల ప్రత్యామ్నాయం పై దృష్టి పెట్టడం ప్రభుత్వ బాధ్యత .

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా , ప్రజల ( సమాజ ) సర్వతోముఖాభివృద్ధి కి ప్రభుత్వం అనేది చేయవలసినంతగా చేయలేకపోతోంది . ఇంకో డెబ్భై ఏళ్లు గడిచినా , చేయలేదు .
ఎందుకని అంటే ; ఇన్ని వనరులు ప్రభుత్వం వద్ద ఉండవు .
అసలు “సామాజిక బాధ్యత ” అనేది ప్రభుత్వానిది మాత్రమే కాదు .
ఈ సమాజమే పెట్టుబడిగా …’చట్టబద్ధమైన ఆదాయం’ కలిగిన ప్రతి పౌరుడుకీ ఈ “సామాజిక బాధ్యత” ఉంది .

గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు గల ప్రజాప్రతినిధులకు , ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ , ప్రతి వ్యాపార….పారిశ్రామిక సంస్థకు, ఆదాయపన్ను చెల్లించే ప్రతి ఒక్కరికీ ఈ సామాజిక బాధ్యత ఉన్నదనే భావనను, సమాజం లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులపై ఉంది.

ఇప్పుడు విజయవాడ కు వరదలు వచ్చాయి. ఇళ్ళు వాకిళ్ళు మునిగిపోయాయి . తింటానికే కాదు , బాత్ రూమ్ కి వెళ్ళడానికి కూడా జనానికి దిక్కులేక హాహాకారాలు చేస్తున్నారు . ఆ దృశ్యాలు టీవీల్లో చూడలేకపోతున్నాం .ఆ వార్తలు పత్రికల్లో చదవలేక పోతున్నాం . తెలుగువారి అదృష్టం కొద్దీ , ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు , తన “సామాజిక బాధ్యత” గా క్షణాల్లో రంగం లోకి దిగారు . బెజవాడ రోడ్లపై అర్ధరాత్రుళ్ళు కూడా తిరిగారు.పునరావాస పనులను ప్రత్యక్షం గా పరిశీలించారు .

సమీక్షించారు . బాధితులతో మాట్లాడారు . వరద లేని జిల్లాల నుంచి మనుషులను ,వనరులను భారీ స్థాయిలో సమీకరించారు . ఆయన్ను చూసి , మంత్రులూ రంగం లోకి దిగారు . అధికారులూ కొంచెం వళ్ళు వంచారు . ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల వల్ల , బాధితులు నేడో ….రేపో సొంత ఇళ్లకు వెడతారు .

“శభాష్! చంద్రబాబు ..!!” అని తెలుగు సమాజం ఎలుగెత్తి కీర్తించింది . చంద్రబాబు సరే ! తెలుగు సమాజమే పెట్టుబడిగా చేసుకుని లక్షలు , లక్షల కోట్లు సంపాదించిన …., సంపాదిస్తున్న వారి “సామాజిక బాధ్యత ” పరిస్థితి ఏమిటి ? వ్యాపార , పారిశ్రామిక వర్గాల పరిస్థితి ఏమిటి ? వంటికి చమట పట్టకుండా …నెల నెలా జీతాల రూపం లో వేలు , లక్షలు ఆర్జిస్తున్న వారి పరిస్థితి ఏమిటి ? ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏమిటి ? వీరందరికీ మార్కెట్ – తెలుగు సమాజమే కదా !

ఆపదలు , వరదలు ,ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు …పక్కవారు ఏమనుకుంటారో అన్న గిల్టీ ఫీలింగ్స్ తో కోటో… అరకోటో…. పావుకోటో విదిలించి , దానికి సరిపడా ఫ్రీ పబ్లిసిటీ సంపాదిస్తే ; వారి “సామాజిక బాధ్యత ” తీరినట్టేనా ? కాదు .

సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్” ఏర్పాటు చేయాలి!
రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షులుగా , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్య కార్యదర్శి/చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ” సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్ ” ను చట్టబద్ధం గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ , జీ ఎస్ టీ చీఫ్ కమిషనర్ , పంచాయతీ రాజ్ , మున్సిపల్ , విద్యా , వైద్య -ఆరోగ్య ,రోడ్లు , రోడ్లు – భవనాల శాఖ ,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్సులు సభ్యులుగా ఈ కౌన్సిల్ ఏర్పాటు కావాలి.
రాష్ట్రం లో ఆదాయపన్ను చెల్లించే ప్రతి సంస్థ , ప్రతి వ్యక్తి కూడా నెల నెలా ఈ కౌన్సిల్ కు ప్రభుత్వం నిర్ణయించిన శాతం మొత్తాన్ని ఈ సంస్థకు చెల్లించే విధం గా నిబంధనలు రూపొందించాలి . ఈ సంస్థ జారీ చేసే ఎన్ ఓ సీ ఆధారంగానే ఆయా వ్యక్తుల , సంస్థల ఆదాయపన్ను , జీ ఎస్ టీ క్లెయిమ్స్ ను క్లియర్ చేసే విధంగా నిబంధనలు రూపొందించాలి .

ఉదాహరణకు , ప్రజాప్రతినిధులు (ఏ కేటగిరీ అయినా) ,సినిమా పరిశ్రమకు చెందిన వారు ….తమ చట్టబద్ధ సంపాదనలో 5 శాతం , పారిశ్రామిక వేత్తలు తమ లాభాలలో 4 శాతం, వ్యాపారులు 3శాతం , సేవల వ్యాపారులు ,ప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగులు 2 శాతం ,నాన్ గెజిటెడ్ …. లక్ష లోపు జీతాల వారు 1 శాతం ఈ “సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్ ” కు చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించాలి .
విపత్తులు , ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనే గాక ; సమాజానికి అవసరమైన ప్రతి రంగం మెరుగుదలకూ ….ఏడాది పొడవునా ఈ నిధులు వాడవచ్చు .

గ్రామాలలో మంచి రోడ్లు వేయడానికి , గ్రామాల మధ్య రోడ్లు వేయడానికి , విద్యుత్ సరఫరా మెరుగుదల చర్యలకు , మురుగు కాలువల్లో గుర్రపు డెక్క కు తొలగింపుకు , అన్నా క్యాంటీన్ లను ఏడాది పొడవునా నిరంతరాయంగా నిర్వహించడానికి , అన్ని స్థాయిలలో విద్యా వసతుల పెంపుదలకు , వైద్య – ఆరోగ్య వసతుల మెరుగుదలకు , వీరందరి సేవలకు అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ….; “సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్ ” కు జమయ్యే నిధుల నుంచి పారదర్శకం గా నిధులు కేటాయించవచ్చు . ఈ సామాజిక వసతులు మెరుగు పడితే ; జనం కూడా నిశ్చింతగా , గౌరవం గా , తృప్తిగా జీవనం సాగిస్తారు .

దీని అవసరం ఏమిటి ?
సమాజం లో ప్రజలకు కనీసావసరాలు కల్పించగల ఆర్థిక వనరులు ప్రభుత్వం వద్ద ఉండవు. దానికి జన్మతః ఉండే అవలక్షణాలు సరిదిద్దగలిగినవి కావు. ప్రభుత్వానికి నెల వారి పన్నుల రూపం లో వచ్చే రాబడి ఉద్యోగుల, పింఛనుదారుల జీతభత్యాలకు, పాత అప్పుల వడ్డీలకు సరిపోతుంది . పావలా బేడా మిగిలితే …., ప్రభుత్వ వ్యవస్థల నిర్వహణకు సరిపోతుంది. ఇక, దేనికీ ప్రభుత్వం వద్ద నిధులు ఉండవనేది బహిరంగ రహస్యమే . అప్పులకు బయలు దేరాలి.

“సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్ ” ను చట్టబద్ధం గా ఏర్పాటు చేస్తే ….
*ప్రకృతి విపత్తుల సమయం లోనే గాక ; ఏడాది పొడవునా ప్రణాళికాబద్ధమైన వసతుల మెరుగుదల చేయవచ్చు .
*సామాజికా బాధ్యత భావాన్ని ప్రతి ఒక్కరిలో ప్రోది చేయవచ్చు .
*ప్రణాళికా బద్ధమైన వసతుల మెరుగుదల వల్ల ,వరదలు రావు . వర్షాలు వచ్చినా నీరు ఇళ్లల్లోకి జొరబడదు .

*గ్రామాలలో కూడా ప్రభుత్వసాయం కొరకు ఎదురు చూపులు ఉండవు .
*గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడడం వల్ల ….”అమ్మ ఒడి…నాన్న బుడ్డి…”వంటి చిల్లర పథకాలకు ప్రభుత్వ నిధులు వృధా కావు .

*తెలుగు సమాజం సగౌరవంగా తలెత్తుకుని,ఆరోగ్యంగా జీవనం సాగిస్తుంది . పిల్లలకు మంచి , నాణ్యమైన చదువులకు అవకాశం కలుగుతుంది .

*సమాజం లో ఆవారాగాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతుంది . నిజానికి ఇదేమీ కొత్త ఆలోచన కాదు . 2013 లోనే మన్మోహన్ సింగ్ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం “కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ “(సీ ఎస్ ఆర్)చట్టం తీసుకొచ్చింది . అంటే కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా విరాళాలు ఇవ్వడానికి ….వాటిని మోటివేట్ చేసే ప్రయత్నం అన్న మాట . ఈ ఆలోచనను వ్యవస్థీకరణ చేసి,ఆదాయ పన్ను చెల్లింపు వర్గాలకు దీనిని అనుసంధానించడమే ఇప్పుడు చెయ్యాల్సిన పని . ఆదాయపు పన్ను చెల్లింపు వర్గాలను సామాజిక బాధ్యత వైపు మళ్లించి , వారి విరాళాలతో సమాజం లో మొత్తం మౌలిక సదుపాయాల కల్పన/ మెరుగుదలకు నడుం బిగించక పోతే; ఎన్ని సంవత్సరాలైనా … మన సమాజ జీవన స్థితిగతులు ఇలాగే….విషాద సంగీతం ఆలపించుకుంటూ ఉంటాయి. చేస్తే ….చంద్రబాబే చేయాలి …!

“సామాజిక బాధ్యత ” ను ఒక చట్టబద్ధమైన వ్యాపకం గా చేయడానికి చంద్రబాబే పూనుకోవాలి. సమాజం కష్ట సుఖాలపట్ల తగిన రీతిలో స్పందించే తత్వం ఆయన స్వంతం . ఒక ముక్కలో చెప్పాలంటే – పేటెంట్ హోల్డర్.

రాష్ట్రానికి మేలుచేసే చిరస్మరణీయ మైన అపూర్వ అవకాశం ఆయనకు 73 ఏళ్ల వయసులో లభించింది . అయినప్పటికీ 37 ఏళ్లవారు సైతం పని లో ఆయనతో పోటీ పడలేరు అనేది వేరే విషయం .

రాజకీయాసురుల విషకౌగిలి నుంచి రాష్ట్రాన్ని , ప్రజలను విముక్తి చేసిన నేతగా కీర్తి గడించిన చంద్రబాబు , “సోషల్ సెక్యూరిటీ ” కి పటిష్టమైన , లూప్ హోల్స్ లేని పకడ్బందీ చట్ట బద్ధత కల్పించి , దేశం లోనూ , రాష్ట్రం లోనూ చిరస్థాయిగా నిలిచిపోవాలి అనేది సామాజిక కార్యకర్తల భావన .

ఇందుకోసం , ఈ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై పౌర సమాజం లో విస్తృతమైన చర్చలు జరగాలి . అన్ని రాజకీయ పక్షాల నేతలతో ప్రభుత్వ బాధ్యులు సమావేశాలు నిర్వహించాలి . ఆదాయపన్ను చెల్లింపుదారులతో సెమినార్లు నిర్వహించాలి . పౌరులనుంచి అభిప్రాయాలు ఆహ్వానించాలి . ఈ మొత్తం కసరత్తు అంతా చేయడానికి మంత్రుల ఉపసంఘం ఒకటి ఏర్పాటు కావాలి. వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలి .

“సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్ ” ను ఎంత పకడ్బందీ గా రూపొందించి , మొత్తం సమాజానికి ఏ విధం గా ఉపయోగపడాలి అనే ఆలోచనకు సమయం కేటాయిస్తే ; ఆయన జన్మ ధన్యం అవుతుంది . ఆయనను తన అల్లుడిగా చేసుకున్న ఎన్ టీ రామారావు ఆత్మ సంతోషిస్తుంది . తెలుగు సమాజం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది.

( భోగాది వేంకట రాయుడు)