– చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరి, మహానాడు: విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఒక్కటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఆదివారం సన్మానించారు. చంద్రగిరి టౌన్‌లోని స్టేట్ బ్యాంక్ (మెయిన్ బ్రాంచ్) ముందర ఉన్న విశ్రాంతి ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ సభకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానిని మంగళ వాయిద్యాలతో పండితుల మంత్రోచ్ఛారణతో పూర్ణకుంభంతో విశ్రాంతి ఉద్యోగులు ఆహ్వానం పలికారు. వినాయక స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి ఆత్మీయ సమావేశ సభ ప్రారంభించారు. పలువురు విశ్రాంతి ఉద్యోగులు ప్రసంగించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుభవం కలిగిన పెద్దలు నన్ను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విశ్రాంతి ఉద్యోగులు అడిగిన సమస్యలపై స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను వారం పది రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యకర్తలు భాస్కర్, భాను లు మృతి చెందినప్పుడు స్మశాన వాటిక పరిస్థితి చూసి ఆరోజే గోవిందధామంకు స్థలం కేటాయించామన్నారు. ప్రస్తుతం జెసిబిలతో క్లీన్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. చంద్రగిరి విస్తరణ చెందినప్పటికీ 30 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోక పోవడం బాధాకరం.
చంద్రగిరి నూరు జంక్షన్ నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 80 నుండి 100 అడుగుల రోడ్డు విస్తరింప చేయాలని, గోవిందుని భక్తులకు విశ్రాంతి షెడ్డు లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు తెలిపారు. చంద్రగిరిలో అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు అడిగిన సమస్యలను దగ్గరుండి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. విశ్రాంతి ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే పులివర్తి నాని ని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల విశ్రాంతి ఉద్యోగులు, ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు పాల్గొన్నారు.