– సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సూరాయపాళెం, మహానాడు: పంట కాలువలు బాగుపడుతుంటే కాకాణి ఓర్చుకోలేకపోతున్నారు… రైతుల భాగస్వామ్యంతో పనులు జరుగుతుంటే అంత బాధేందుకో… కరోనా హౌస్ వదిలి ఊళ్లలోకి వస్తే అవినీతిని ప్రశ్నించి చెక్కతో కొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం సూరాయపాళెం సమీపంలో సంగం ఆనకట్ట వద్ద నుంచి కనుపూరు కాలువకు గురువారం నీళ్లు విడుదల చేసిన సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు.
సంగం ఆనకట్ట వద్ద నుంచి కనుపూరు కాలువకు నీటిని విడుదల చేశాం. మొన్న కనుపూరు కాలువ వద్ద డ్రామాకు తెరలేపి చివరకు తోక ముడిచారు.. రైతులు చేసుకుంటున్న పనులకు టెండర్ల పేరుతో వేషాలేస్తే తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తుంచుకోండని ఆయన హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. అక్టోబర్ 20వ తేదీ నాటికే నీటిని వదిలిపెట్టాల్సింది. అదును పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 10 రోజుల నుంచి 30 ప్రొక్లెయిన్లు, 15 బుల్‌డోజర్లు పనిచేస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత కాలువల్లో పూడికతీత ముమ్మరంగా సాగుతోంది. ఇది చూసి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నిద్రపట్టడం లేదు. వారి హయాంలో మాదిరిగా కాలువల నిండా నీళ్లు వదిలి పూడికతీత పేరుతో బోట్ షికారు చేయలేదని బాధపడిపోతున్నట్టున్నారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకోలేదని ఫీలయిపోతున్నారు.
గత ఏడాది రెండో పంటలో లక్ష ఎకరాల పంటకు 40 టీఎంసీల నీటిని కాజేసిన పెద్ద మనుషులు వాళ్లు. ఈ ఏడాది మొదటి పంటలో మూడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకుండా బీడు పెట్టిన మహానుభావులు. ఇప్పుడు కాలువలు బాగుపడి ఆయకట్టు మొత్తం పంట పండిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. నేటి మధ్యాహ్నం ఐఏబీ సమావేశం జరగబోతోంది. ఒక్క చుక్క సాగు, తాగునీరు వృథాకాకుండా కాపాడటమే మా లక్ష్యం. ఇప్పుడు నీళ్లు వృథా అయితే తర్వాత పంట విషయంలో రైతులు నష్టపోయే ప్రమాదముంది. మేం గతంలో ఒక టీఎంసీ నీటికి 16 వేల ఎకరాలు పండించి చరిత్ర సృష్టించాం. 2023లో 1.05 లక్షల ఎకరాలకు 40 టీఎంసీలు ఖర్చు పెట్టి వైసీపీ నేతలు చరిత్ర సృష్టించారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన జలవనరుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. రేపోమాపో అన్ని కాలువలకు నీళ్లు విడుదల చేయబోతున్నారు. నీటి విడుదలకు ఇప్పటికే 10 రోజులకు పైగా ఆలస్యమైంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని కాలువల్లో పూడిక ఎందుకు తీస్తున్నారని కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గతంలో నక్కలకాలువలో పూడికతీతను రూ.11 కోట్లతో టెండర్ పిలవకుండా ఎందుకు చేస్తున్నారని మేం ప్రశ్నించాం.. నక్కలకాలువ పంట కాలువ కాదు.. కేవలం డ్రైన్ మాత్రమే. అప్పట్లో రూ.11 కోట్లతో కేవలం ఒక్క నక్కల కాలువలో పూడిక తీస్తే ఇప్పుడు రూ.7 కోట్లతోనే సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 200కి పైగా పనులను చేస్తున్నాం.
మొన్న డిసెంబరులో ఐదు ప్యాకేజీల పేరుతో రూ.18.50 కోట్లు స్వాహా చేశారు. సీఈ రిజెక్ట్ చేసిన ప్యాకేజీలను అప్పటి ఎస్ఈ ఆమోదించి కాకాణి అండ్ బ్యాచ్ కి దోచిపెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఏ కాలువ పని చేశారో రైతులకు కూడా తెలియకుండా బిల్లులు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి పనిని రైతుల భాగస్వామ్యంతో వారి పర్యవేక్షణలో చేస్తున్నాం. రైతుల భాగస్వామ్యంతో ఓ అండ్ ఎం పనులు జరుగుతున్నాయని కాకాణి కడుపు రగిలిపోతోంది.. కరోనా ప్యాలెస్ లో కూర్చుని క్యాష్ లెక్కపెట్టుకోవడం కాదు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లి రైతుల మధ్య నిలబడి మాట్లాడు. వైసీపీ పాలనలో సాగిన విచ్చలవిడి అవినీతిపై చెక్కతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఐదేళ్లుగా అడుగు ముందుకు పడని సోమశిల దక్షిణ కాలువ పెండింగ్ పనులను దాతల సహకారంతో చేపట్టి అదనంగా అయిదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.