దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ

• దేశీయ రకం గోవులను పెంచేవారికి దేవాదాయ శాఖ తరపున 5 శాతం సబ్సిడీ
• త్వరలో దేవాలయ ట్రస్టు బోర్డుల నియామకాలు
• ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో నిరుద్యోగ సంభావన 
• ప్రసాదాలు, అన్న ప్రసాద తయారీలో ఏ గ్రేడ్ సామాగ్రే వాడాలి
• దేవాలయాల్లో కావాల్సింది ఆధ్యాత్మిక చింత.. వ్యాపార ధోరణి కాదు
• ఆలయాల్లో ఓంకారాలు, దేవతా మూర్తుల వేద మంత్రోఛ్చారణ నిరంతరం వినిపించాలి
• ఎన్నికల హామీల అమలులో అగ్రభాగంలో దేవాదాయ శాఖ
• దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయ రెడ్డి 

దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ క్యాడెర్లలోని అధికారులు, అర్చకులకు సంబంధించి 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  దేవాదాయ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాలనా పరమైన విభాగంలో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

దేవాలయాలన్నీ పరిశుభ్రత, ఆధ్యాత్మికతలో కళకళలాడేట్లుగా అధికారులందరూ పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉందని దానిని కాపాడే విషయంలో నిర్లిప్తత ఉండకూడదన్నారు. కార్తీక మాసంలో నిర్దేశించిన ప్రాంతాల్లో చతుర్వేద సభలు నిర్వహించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గడచిన నాలుగు నెలల కాలంలో దేవాదాయ శాఖలో అనేక మార్పులు తీసుకుని వచ్చామని, ఇంతవరకు దేవాదాయ శాఖ అంటే చాలా చిన్నదిగా భావించే అందరి భ్రమలను  తొలగిస్తూ ఈ శాఖ ఎంతో గొప్పది అనే విధంగా పేరు సాధించామని, ఈ పేరు  చిరకాలం నిలిచిపోయేలా అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. 50 వేలకు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలు ఉండేలా నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుకు తెస్తూ, దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో అదనంగా ఇద్దరి సభ్యులను నియమించాలన్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలో జారీ అవుతుందన్నారు. నిర్దేశిత కాలపరిమితితో, స్పష్టమైన మార్గదర్శకాలతో సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ను వెలువరిస్తామన్నారు.

దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన వేద సభలో వేదపారాయణం పండితులనే కాకుండా పామరులను కూడా  ఉత్తేజితం చేసిందని, దానిని ఒక ప్రాంతానికే పరమితం చేయకుండా, వేద పఠనం విశిష్టత, వేద స్ఫూర్తి నలుదిశలా కొనసాగుతూ, దాని అర్థాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలో వచ్చేలా చూడాలన్న లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలన్నిటా వేద సభలను నిర్వహించాలన్నారు. వేదాధ్యయనం చేసి, ఉపాథి కోసం ఎదురు చూస్తున్న వేద పండితులకు , యువగళం స్ఫూర్తితో సంభావన పేరుతో నెలకు 3 వేల ను అందించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని, ఈ పథకం కింద గుర్తించిన సుమారు 600 మందికి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ లబ్ధిని అందించనున్నామన్నారు.

దేవాలయాల్లో ప్రసాదం, అన్న ప్రసాదం తయారీలో వినియోగించే సామగ్రిని అంతటినీ, ఏ గ్రేడ్ రకానివే వినియోగించేలా చూడటానికి, కేంద్రీకృత వ్యవస్థను తీసుకురానున్నామని,ఇందుకు సంబందించిన విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. అంతే కాకుండా, ఆయా దేవాలయాల్లో పారిశుద్ధ్య పనులు, భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా మానవ వనరుల వినియోగంలో కుడా కేంద్రీకృత విధానాలు తీసుకుని వస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రదానమైన దేవాలయాన్నిటిలోనూ ప్రసాదం రుచి గతంలో కంటే మెరుగ్గా ఉందన్న ఫీడ్ బ్యాక్ వస్తుందన్నారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడవద్దన్నారు. అవసరాలకు అనుగుణంగా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు వీలుగా, దేశీయ గోవులను పెంచేందుకు ఆసక్తి చూపే వారికి దేవాదాయ శాఖ తరపున 5 శాతం సబ్సిడీని ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. అంతే కాకుండా ఆయా దేవాలయాలకు దాతలు వివిధ రూపాల్లో విరాళాలు ఇస్తుంటారని, వాటిపై దాతల పేర్లు తప్పకుండా ఉండేలా చూడటంతో పాటు, వారికి ఆలయాల్లో సముచిత గౌరవమిస్తే, మరింత మంది దాతలు ముందుకు వస్తారన్న విషయాన్ని ఆలయ ఎగ్జుక్యూటవ్ ఆఫీసర్లందరూ గుర్తించుకోవాలన్నారు. అలాగే దాతలిచ్చిన విరాళాల వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో తప్పని సరిగా రికార్డు చేయాలన్నారు.

ఆలయాల ఆస్తులు పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని, ఇప్పటికే వివిధ రకాలుగా కబ్జా అయిన వాటిపై సమగ్రంగా నివేదిక రూపొందించాలన్నారు. అలాగే కొంత మంది అధికారులు ప్రైవేటు వ్యక్తుల భూములను 22(ఎ) కింద గుర్తించినందువల్ల, ఆయా వ్యక్తులు నష్టపోతున్నారని, దీనిని దేవాదాయ శాఖ అధికారులతో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని, జిల్లా కలెక్టర్ ద్వారా సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆలయంలోనూ ఆయా దేవతా మూర్తుల, నామ స్మరణ క్రమం తప్పకుండా జరిగేలా ఆలయం విశిష్టతను కాపాడాలని మంత్రి వివరించారు.

పర్యాటక శాఖ తో సమన్వయం చేసుకుంటూ త్వరలోనే  టెంపుల్ టూరిజం ను అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కూడా త్వరలోనే నిర్వహించనున్నామన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, అదనపు కమిషనర్లు చంద్రకుమార్, రామచంద్రమోహన్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.