త్వరలో హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సేవలు

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చి దిద్దుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పనులను 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు అంకితం చేస్తారని కేంద్రమంత్రి తెలిపారు. రూ.430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

అమృత్‌ పథకంలో భాగంగా స్థానికంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.430 కోట్లతో చర్లపల్లి, రూ.715 కోట్లతో సికింద్రాబాద్‌, రూ.429 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్‌లలో పనులు ప్రారంభించినట్టు తెలిపారు. రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్‌ మానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించినట్టు చెప్పారు. దానికి సంబంధించిన నిర్మాణ పనులు త్వరలో చేపడతామన్నారు.