తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్

అమరావతి, మహానాడు: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నివసిస్తున్న తెలుగువారికి గురువారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, విశ్వ వ్యాప్తంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నది.. భాష ఒక జీవితమైపోవడం, భావ వ్యక్తీకరణకు, జ్ఞానానికి, సృజనాత్మకతకు మార్గదర్శిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించాలని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు గుర్తు చేశారు. భాషా పరిరక్షణ మనందరి బాధ్యతగా ఉండి, ప్రతి ఒక్కరూ తమ భాషను గౌరవించి, భవిష్యత్ తరాలకు అందించేలా కృషి చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. భాషా దినోత్సవం రోజు, తెలుగు భాషా సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం, విస్తృతంగా ప్రచారం చేయడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. తన సందేశంలో, ఈ ప్రత్యేక సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, మన తెలుగు భాషను మరింత శక్తివంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆయన కోరారు.

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్‌

తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు వాడుక భాష‌లో రచనలు ఉండాల‌ని జీవితాంతం ఉద్య‌మించిన వ్య‌వ‌హారిక భాషా పితామ‌హుడు గిడుగు రామ‌మూర్తి గారి జ‌యంతిని తెలుగు భాషా దినోత్స‌వంగా నిర్వ‌హించుకోవ‌డం, ఆ మ‌హ‌నీయుని కృషిని స్మ‌రించుకునే అవ‌కాశం తెలుగువారిగా మ‌న‌కు ద‌క్కింది.

అమ్మ జ‌న్మ‌నిస్తే, మాతృభాష తెలుగు మ‌న జీవితాల‌కు వెలుగునిస్తోంది. ఇంగ్లీషు మీడియం, విదేశాల్లో చ‌దువు వ‌ల్ల నేను మొద‌ట్లో తెలుగులో మాట్లాడేట‌ప్పుడు ప‌దాలు అటు ఇటు అయితే.. ఎంతో బాధ‌ప‌డేవాడిని. అచ్చ‌మైన తెలుగులో నిత్యం జ‌నంతో మాట్లాడుతూ ఉంటే మాతృభాష మాధుర్యం ఎంత గొప్ప‌దో తెలుస్తోంది. మా అబ్బాయి దేవాన్ష్‌కి ప్ర‌త్యేకంగా తెలుగు మాట్లాడ‌ట‌మే కాదు.. చ‌ద‌వ‌టం, రాయ‌టం కూడా నేర్పిస్తున్నాను. తెలుగువారిగా గ‌ర్వ‌ప‌డ‌దాం.. తెలుగు భాష ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేద్దాం. తెలుగు భాషని సుసంప‌న్నం చేస్తున్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.