Mahanaadu-Logo-PNG-Large

సీజనల్ వ్యాధుల నియంత్రణకు రూ.50 కోట్లతో ప్రత్యేక డ్రైవ్

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ

అమరావతి : వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ఉండేందుకై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దాదాపు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తాచెదరాన్ని తొలగించి పారిశుద్య పరిస్థితులను మెరుగు పర్చేందుకు ఈ డ్రైవ్ లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి సమావేశమై కార్పొరేషన్ల వారీగా ఆర్థిక స్థితిగతులను, పారిశుద్య పరిస్థితుల మెరుగుకు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

అనంతరం పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు ఉన్నాయని, వాటిలో 17 కార్పొరేషన్లు, 24 నగర పంచాయితీలు మరియు 72 మున్సిపాలిటీలు ఉన్నట్లు తెలిపారు. నేడు 17 కార్పొరేషన్ల కమిషనర్లతో సమీక్ష నిర్వహించడం జరిగిందని, సోమవారం నగర పంచాయితీల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

నేడు కమిషనర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో మున్సిఫల్ ప్రాంతాల్లో త్రాగునీరు కలుషితం కాకుండా ఉండేందుకై పైపుల లీకేజీని 24 గంటల్లో అరికట్టాలని, కాలువల్లో చెత్తాచెదరాన్ని జూలై మాసాంతాని కల్లా తొలగించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

గ‌తంలో తమ ప్రభుత్వ హయాంలో ప్ర‌తి ఇంటికీ 24 గంటల పాటు త్రాగు నీరు అందించడంతో పాటు ముగునీటి పారుదల పైపులు, ముగురు నీటి శుద్ది ప్లాంట్లు, వరద నీరు పారుదల కాలువలు ఏర్పాటు పనులను చేపట్టడం జరిగిందన్నారు. దీనికోసం ఏషియ‌న్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా రూ.5,350 కోట్లు కేటాయించామ‌న్నారు. అయితే ఈ నిధుల్లో గత ప్రభుత్వం కేవలం రూ.429 కోట్లను మాత్రమే వెచ్చించి మిగిలిన నిధుల వినియోగానికి రాష్ట్ర వాటాను కేటాయించకుండా నిరుపయోగంగా వదిలేసిందన్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే కనీసం 50 శాతం మున్సిపాలిటీల్లో త్రాగునీటి సమస్య ఉండేది కాదన్నారు. ఈ నెలాఖరు కల్లా ఆ ప్రాజక్టు అమలు గడువు కూడా ముగియనుందన్నారు. ఈ ప్రాజెక్టు క్రింద మిగిలిన నిధులను ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టు కాలపరిధిని పెంచాలని కోరుతా ఏషియ‌న్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు కు లేఖ వ్రాయం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు క్రింద మిగిలిన నిధులను అన్నింటినీ వినియోగించుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తామన్నారు.

లక్ష లోపు జనాభా ఉన్న నగర పంచాయితీల్లో మౌలిక వసతుల మెరుగుకు అమృత-I&II ప్రాజక్టులను తమ ప్రభుత్వ హయాంలో చేపట్టగా, గత ప్రభుత్వం ఆ ప్రాజక్టులను కూడా నీరుగార్చిందన్నారు. అమృత-I పథకం క్రింద కేటాయించిన నిధులు రూ.3,362 కోట్లలో కేవలం రూ.2,213 కోట్లను మరియు అమృత-II పథకం క్రింద కేటాయించిన నిధులు రూ.8,078 కోట్లలో కేవలం రూ.360 కోట్లను మాత్రమే గత ప్రభుత్వం వెచ్చించి మిగిలిన నిధుల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుండా, మున్సిఫాలిటీలకు వచ్చే నిధులను ఇతర పథకాలకు మళ్లించడం జరిగిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి ఈ పథకాల పునరుద్దణకు రాష్ట్ర వాటాని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగానున్న అన్ని పట్టణ ప్రాంతాల్లో చెత్తను ఎక్కువగా వేసే దాదాపు 20 వేల బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని గ్రీన్ స్పాట్లుగా మార్చేందుకు రాష్ట్ర కార్యాలయంలో డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించడం జరిగేదన్నారు.

అయితే ఆ వ్యవస్థను కూడా గత ప్రభుత్వం నీరుగార్చిందని, ఆ వ్యవస్థను రానున్న వారం రోజుల్లో పునరుద్దరించి రాష్ట్ర వ్యాప్తంగా నున్న బ్లాక్ స్పాట్లను అన్నింటినీ గ్రీన్ స్పాట్లుగా మారుస్తామన్నారు. ఏషియన్ డవలెప్మెంట్ బ్యాంకు ఆర్థిక సహాయంతో మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో త్రాగునీరు, వరద నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందని, ఆ పనులు త్వరలో పూర్తి కానున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో వ‌చ్చే వంద‌రోజుల్లో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు చ‌ర్య‌లు చేపట్టామని, విజయనగరం, సాలూరు ప్రాంతాల్లో స్థలాల సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో దేశంలోనే ఆదర్శంగా ఉండే విధంగా టిడ్కో గృహాలను నిర్మించడం జరిగిందని, అయితే గత ప్రభుత్వం ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిందన్నారు. ఈ ప్రాజక్టును పూర్తి స్థాయిలో స్టడీ చేసి ప్రాజక్టు స్థితిగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ అర్బన్ ఫైనాన్సు, ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి.హరిత ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.