– ఎమ్మెల్యే యార్లగడ్డ
విజయవాడ, మహానాడు: గన్నవరం నియోజకవర్గంలోని పట్టణాలు గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రసాదంపాడు లోని దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి, తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సుమారు 60 లక్షల నిధులతో ప్రసాదంపాడు లోని యాదవుల బజారు సిసి రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు చెప్పారు. వీటి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, వేగవంతం గా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. గడిచిన ఎన్నికలలో విజయవాడ రూరల్ మండలంలో తనను ఆదరించి 20 వేలకు పైగా ఓట్ల మెజార్టీ ఇచ్చిన రూరల్ మండల గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని యార్లగడ్డ హామీ ఇచ్చారు.
గతంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా పని చేసిన సమయంలో బ్యాంకు ను ఏవిధంగా అభివృద్ధి పదంలో పై నింప చేశానో గన్నవరం నియోజకవర్గంలో కూడా తనదైన శైలి లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. రామవరప్పాడు ప్రసాదంపాడు గ్రామాల్లో ఏలూరు కాలపై వంతెన నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశామని ప్రభుత్వానికి పంపించామని త్వరలో నిధులు మంజూరు అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మల్లవల్లి ఇండస్ట్రీస్ ఏరియాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్టు యార్లగడ్డ వివరించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకు వెళతానని, ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యం తో రాజకీయాల్లోకి వచ్చానని, అవినీతికి తావు లేకుండా, నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కొల్లా ఆనంద్, సీనియర్ నాయకులు గూడవల్లి నరసయ్య, బొప్పాన హరిబాబు, తెలుగు యువత నాయకులు సర్నాల బాలాజీ, ప్రసాదంపాడు సర్పంచ్ గంగారత్నం, పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.