– సమీప భవిష్యత్తులో మరింత పురోగతి సాధించేలా ప్రణాళికలు సిద్ధం
– ఈ దిశగా.. ఎన్‌ఎంఈటీతో బాటలు
– ఆరో ఎన్‌ఎంఈటీ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
– ఏపీ ఎన్‌ఎంఈటీ తరహాలో.. మెరిట్ ఏర్పాటుచేసుకోవడాన్ని అభినందించిన మంత్రి
న్యూఢిల్లీ: భారతదేశంలో ఖనిజాల ఎక్స్‌ప్లొరేషన్ కు సంబంధించి భవిష్యత్తులో మరింత సానుకూల ముందడుగు వేయబోతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో.. జరిగిన ఆరో ఎన్‌ఎంఈటీ (నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్) గవర్నింగ్ బాడీ సమావేశాన్ని ఉద్దేశించి ఎక్స్-అఫిషియో చైర్మన్ హోదాలో కేంద్రమంత్రి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఖనిజ సంపదలకు లోటులేదన్నారు. కానీ ఇంతవరకు వివిధ కారణాలతో..అనుకున్నంతగా ఆ సామర్థ్యాన్ని అందిపుచ్చుకోలేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్‌ఎంఈటీ ను స్థాపించారన్నారు. ఈ సంస్థ ద్వారా.. ఖనిజాల ఎక్స్‌ప్లొరేషన్లో ఏటేటా పురోగతి సాధిస్తున్నామన్నారు. రాష్ట్రాలు ఎన్‌ఎంఈటీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. స్టార్టప్ లను ప్రోత్సహించడం, ప్రైవేటు రంగానికి అవసరమైన సహకారాన్ని అందించడం వంటి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సంపూర్ణ సహకారం అందించేందుకు కృషిచేస్తామన్నారు. సహకార సమాఖ్య విధానంలో అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్‌ఎంఈటీ ద్వారా చేపట్టిన వివిధ కార్యకలాపాలను, ప్రాజెక్టులను ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివరించారు. నేషనల్ జియోసైన్స్ డేటా రిపాజిటరీ (ఎన్‌జీడీఆర్) పోర్టల్ ద్వారా.. ఎక్స్‌ప్లొరేషన్ ద్వారా సాధించిన పురోగతిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి నేతృత్వంలో ఈ రంగంలో మరింత పురోగతి సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు.. కేంద్ర అటామిక్ ఎనర్జీ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ దుబే మాట్లాడుతూ.. దేశంలో ఖనిజాల సామర్థ్యాన్ని వెలికితీసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని, పరస్పర సహకారంతో జాతి నిర్మాణానికి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ఏపీ గనుల మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గనుల రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. ఎన్‌ఎంఈటీ తరహాలో.. ఆంధ్రప్రదేశ్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్ (మెరిట్) ను ఏర్పాటు చేశామన్నారు. ఆఫ్ షోర్ మైనింగ్, క్రిటికల్ మినరల్స్ ఎక్స్‌ప్లొరేషన్ పై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. కాగా, ఏపీ తరహాలోనే మిగిలిన రాష్ట్రాలు ఇలాంటి ఆలోచనలతో ఎక్స్‌ప్లొరేషన్ కు ప్రోత్సాహాన్ని అందించాలని కిషన్ రెడ్డి సూచించారు.