-భూసేకరణలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం తప్పనిసరి
– మానవీయ కోణంలో పరిహారం
– ప్రభుత్వ నిబంధనలను కుడా పరిగణనలోకి తీసుకోవాలి
-బి ఆర్ యస్ ప్రభుత్వ నిర్వాహకం తోటే భూసేకరణ లో అలసత్వం
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దేవాదుల: ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు గాను ప్రత్యేకంగా ఒక ఐ ఏ యస్ అధికారిని నియమించ నున్నట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సదరు ఐ ఏ యస్ అధికారి రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణ ను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రోజున దేవాదుల ప్రాజెక్ట్ పంప్ హౌస్ వద్ద నీటిపారుదల శాఖాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఆయన సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సితక్క లతో కలసి మీడియా సమావేశం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ లో అలసత్వం జరగడానికి బి ఆర్ యస్ ప్రభుత్వ నిర్వహకమే నన్నారు.ప్రాజెక్ట్ లకు డిజైన్ లు చేసి చేతులు దులుపుకొన్నారు తప్ప భూసేకరణను ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.
అప్పుడే భూసేకరణ జరిగి ఉంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు అవరోధాలు ఏర్పడేవి కావన్నారు.భూసేకరణలో ప్రజాప్రతినిధులు విధిగా పాలు పంచుకోవాలని ఆయన సూచించారు. రైతులు కుడా ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
అందుకు సంబంధించిన పరిహారం కుడా మానవీయ కోణంలో చెల్లిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ పరిధులను కుడా పరిగణనలోకి తీసుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.