తెలుగు రాష్ట్ర ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌లు

-భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ రెండు రాష్ట్రాల్లోని తన యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు అందించేందుకు ముందుకొచ్చింది.

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా నాలుగు రోజుల వ్యాలిడిటీని అందించనుందని ప్రకటించింది. ఈ సమయంలో యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 1.5GB మొబైల్‌ డేటాను వినియోగించుకోవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

అలాగే, పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం బిల్లు చెల్లింపులో 7 రోజుల గడువును పొడిగించింది. ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వినియోగదారులకు కూడా 4 రోజుల అదనపు వ్యాలిడిటీని అందిస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.

ఎయిర్‌టెల్‌ తీసుకున్న ఈ నిర్ణయం వర్షాల కారణంగా ప్రభావితమవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించగలదని భావిస్తున్నారు.