‘లడ్డులో గొడ్డు’పై ఆధ్యాత్మిక నిరసన!

– కల్తీ నెయ్యిపై కేసు నమోదుకు డిమాండ్‌
– విచారణ సీబీఐకు అప్పగించాలి
– తిరుమలలో అన్యమత ఉద్యోగులను తొలగించాలి
– ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం లేకుండా పార్లమెంట్‌లో బిల్లు తేవాలి
– హిందూ ధార్మిక సంఘాల డిమాండ్‌

అమరావతి/గుంటూరు, మహానాడు:  దేవుడి ‘లడ్డులో గొడ్డు’ తో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో గుంటూరు నగరంలోని ప్రకాశం చౌక్ సెంటర్ (శంకర్ విలాస్ సెంటర్) వద్ద హిందూ ధర్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన భారీ జన సందోహంతో నడుమ శనివారం జరిగింది. నాలుగు అడుగుల వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రకాశం చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా వేద పండితులతో వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామావళి పూజాదికాలు, హారతి నైవేద్య, కైకర్యాలు నిర్వహించారు.

తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న రాజకీయ నాయకులకు తగు రీతిలో శిక్ష విధించాలని, దేవుడు సొమ్మును అప్పనంగా దోచుకున్న టీటీడీ బోర్డు సభ్యులు, ప్రభుత్వాధినేతలను కఠినంగా శిక్షించి, రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలనే సంకల్పంతో ఈ పూజాదికాలు నిర్వహించినట్టు సంఘాలు తెలిపాయి. ఈ సందర్భంగా నిర్వాహకులైన సిరిపురపు శ్రీధర్ శర్మ, వనమా నరేంద్ర, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, దాసరి రాము, వావిలాల కుమార్ తదితరులు ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అత్యధిక భక్తులు కలిగిన కలియుగ దేవుడు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారని అటువంటి ప్రత్యక్ష దైవం పట్ల ఎన్నో పాప కార్యక్రమాలు ప్రభుత్వాల నేతృత్వంలో గతం నుండి నేటి వరకు నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

స్వామివారి పట్ల చేస్తున్న తప్పులకు వారి కుటుంబ సభ్యులు కూడా శిక్ష అనుభవించక తప్పదని శ్రీధర్‌ శాపనార్థాలు పెట్టారు. దోషుల అరికట్టి అడ్డుకట్ట వేయకపోతే హిందూ ఆధ్యాత్మిక భక్త బృందం ఆగ్రహం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. దేశంలో ఉన్న దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా, వారి కబంధహస్తాల్లో నుంచి దేవాలయాలను బయటకు తెచ్చే విధంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టాన్ని దేశంలో ఉన్న హిందూ ప్రజలు కోరుకుంటున్నారని, వారి మనోభావాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఏపీ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన జీవో ఆధారంగా దేవాలయాల్లో అన్యమత ఉద్యోగస్తుల్ని తొలగించి వేరే ప్రభుత్వ సంస్థల్లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దేవుళ్ళనే మోసం చేసే స్థితికి ప్రభుత్వ అధినేతలు, రాజకీయ పార్టీలు దిగజారారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఈ దేశంలో ఏదీ లేదని, ఒకపక్క ప్రజలను మోసం చేస్తూ ఉంటే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు కఠిన శిక్ష విధించారని శ్రీధర్‌ గుర్తు చేశారు. దేవుళ్ళను కూడా మోసం చేసి దోచుకుంటే దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తాడో కాలం నిర్ణయిస్తుందని, మాజీ ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసీసీ ప్రజాప్రతినిధులు హిందూ దేవీదేవతల పట్ల ఎన్నో అపచారాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో స్వామివారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదంలో నకిలీ బియ్యం, నకిలీ నూనెలు, నకిలీ పప్పులు వాడారని, స్వామివారికి నిత్యం సమర్పించే నైవేద్యాల్లో కూడా నకిలీ నెయ్యిని గత ఐదేళ్లపాటు వాడారని ఆవేదన వ్యక్తం చేశారు. లాబ్‌ల రిపోర్టల ఆధారంగా గతంలో పనిచేసిన చైర్మన్లు కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి లతోపాటు టీటీడీ ప్రధాన అధికారులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎండపల్లి శబరి, పెద్దింటి చైతన్య కృష్ణ, చిలుమూరు ఫని, షేక్ బాజీ, వడ్డమాను ప్రసాద్, కూరపాటి కిషోర్, ఐలూరి శ్రీనివాసు, వేదాంతం హరినాథ్, సంజీవ్, వడ్లమూడి రాజా, కొప్పర్తి సీతారమేష్, ఫమ్మిడిగంటం రమణయ్య, వెలగలేటి గంగాధర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, నారాయణరెడ్డి, ఎన్జీవో అసోసియేషన్ మూర్తి, గుండు జ్ఞానేశ్వర్, పట్టాభిరాముడు, రాజ్ కుమార్, ఆంజనేయులు, అన్నా లక్ష్మి, లీల, చెరక కుమార్ గౌడ్, తుమ్మెద కొమ్మిన నరేష్, రాజేష్, మునిపల్లె మునిపల్లి తేజ, బాలు, వంశీ, గుత్తికొండ శ్రీనివాస్, యశ్వంత్ తదితరులతో పాటు రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు మతాలకు అతీతంగా వందలాదిగా హిందూ ధార్మిక సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తొలుత స్వామివారి విగ్రహానికి పూజాదికాలు నిర్వహించి, భక్తులకు, ప్రజలకు ప్రసాదవితరణ గావించారు. అరండల్ పేట సీఐ కొంక శ్రీనివాస్ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పర్యవేక్షించారు.