తిరువనంతపురం, మహానాడు: డాక్టర్ గజల్ శ్రీనివాస్ స్వరపరచి, గానం చేసిన పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డాక్టర్ ముకుంద శర్మ రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తిరువనంతపురం(కేరళ) శ్రీ పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగింది. భారతీయ సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమం అని, వీటిని స్వరపరచి సందర్భ , తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శ్రీ శంకరాచార్య ప్రశంసించారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్ లకు స్వామి వారు అందించారు.