భారీ విజయం దిశగా వామపక్ష నేత దిసనాయకే..
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున చీఫ్ అనుర కుమార దిసనాయకే భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన 10 లక్షల ఓట్లలో 53 శాతంతో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రమేదాస 22 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే 16 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మేరకు లంక ఎన్నికల కమిషన్ డేటాలో ఉన్నది.
దిసనాయకే ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. సర్వే ఫలితాలను నిజంచేస్తూ ఆయన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. మొత్తం అర్హులైన 17 మిలియన్ల మంది ఓటర్లలో 75 శాతం మంది శనివారం జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తికాగానే పోస్టల్ ఓట్లను లెక్కించడం ప్రారంభించారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కవ ఓట్లు వస్తాయో వారే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటివరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే ఫలితాలు వెలువడ్డాయి.